తాటిముంజలు.. ఒంటికి అమృతభాండాలు.. - MicTv.in - Telugu News
mictv telugu

తాటిముంజలు.. ఒంటికి అమృతభాండాలు..

April 30, 2019

ఎండలు మండిపోతున్నాయి. వడగాలులు, ఉక్కపోతతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. వేసవిలో చల్లటి ఏసీ, కూలర్ల గాలి కావాలని, చల్లని పళ్లరసాలు, చలువు చేసే అంబలి, మజ్జిగ వంటివి పుచ్చుకుంటారు. వేసవి సీజన్ పరంగా కొన్ని పళ్లు ప్రత్యేకంగా మార్కెట్లోకి వస్తాయి. వాటిలో కర్బూజా, తాటి ముంజలు నోరు ఊరిస్తుంటాయి. తాటి చెట్లనుంచి కమ్మని తాటి కల్లు మాత్రమే కాదు ఎండాకాలం ప్రసాదంగా తాటి ముంజలు లభిస్తాయి. ఇవి తీసుకుంటే ఒంటికి చలువ చేస్తుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వీటిని. మార్కెట్లో చవకగా లభిస్తున్నాయి. ఐస్ యాపిల్స్‌గా పిలువబడే తాటి ముంజలకు ఇప్పుడు చాలా గిరాకీ. మగచెట్టు నుంచి కల్లు గీస్తారు.. ఆడచెట్టుకు ముంజలు కాస్తాయి.

ఒక్కో చెట్టుకు 200-300 కాయలు వరకు కాస్తాయి. ఒక్కో కాయకు నాలుగు నుంచి ఆరు తాటి ముంజలు వస్తాయి. ఈ చెట్లపై చాలా కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి.

తాటిముంజల వల్ల కలిగే లాభాలు..

తాటి ముంజల్లో ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండటమే కాదు విటమిన్ బి7, విటమిన్ కె, సోలెబుల్ ఫైబర్, క్యాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ కె, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ డి, జింక్, ఐరన్, న్యూట్రిన్స్ వుంటాయి. తక్కువ కేలరీలు కలిగిన ముంజలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. జీర్ణసంబంధ సమస్యలు దూరమవుతాయి. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. గర్భిణులు, పిల్లలకు ఇవి మంచి పోషకాహారం. వేసవిలో వచ్చే చెమటకాయలకు ముంజలతో చెక్ పెట్టవచ్చు. నిమ్మరసంతో ఫలితం లేకపోతే తాటిముంజలు తినడం వల్ల వాంతులను తగ్గించవచ్చు.

తాటి ముంజల్లో నీటిశాతం ఎక్కువ ఉండటం వల్ల వేసవిలో వడదెబ్బ తగలకుండా చేస్తాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తాయి.  వీటిల్లో పొటాషియం సమృద్ధిగా ఉండడం వలన రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. అంతేకాకుండా ఇవి శరీరంలోని హానికర వ్యర్థ పదార్థాలను తొలగించడంలో అద్భుతంగా పని చేస్తుంది. వేసవిలో వచ్చే తాటిముంజల్ని రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా లివర్ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు. తాటి ముంజలు తినడం వలన చెడు కొలస్ట్రాల్ పోయి మంచి కొలస్ట్రాల్ వృద్ధి చెందుతుంది.