సహకార ఎన్నికల్లో ఘర్షణ..మాజీ సర్పంచ్ దారుణ హత్య   - MicTv.in - Telugu News
mictv telugu

సహకార ఎన్నికల్లో ఘర్షణ..మాజీ సర్పంచ్ దారుణ హత్య  

February 15, 2020

Cooperative Society Elections in Suryapet

తెలంగాణలో సహకార ఎన్నికలు కొన్ని ప్రాంతాల్లో  రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం దాడులకు కూడా దిగుతున్నారు. సూర్యాపేట జిల్లాలో పాత కక్షలు ఓ వ్యక్తి ప్రాణం తీశాయి. యార్కరం గ్రామంలో మాజీ సర్పంచ్, టీఆర్ఎస్ నేత వెంకన్నను కొంత మంది దుండగులు వెంబడించి కత్తులతో నరికి చంపారు.శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ దాడిలో ఆయన అక్కడిక్కడే మరణించాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

రాజకీయ కక్షల  కారణంగానే ఈ హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సహకార సంఘం ఎన్నిల్లో కూడా వెంకన్న ఓటర్లను ప్రలోభపెడుతున్నారని కొంత మంది భావించి ఆయనపై దాడికి పాల్పడ్డారు. కత్తులు తీసుకొని వెంబడించగా భయంతో పరుగులు పెట్టాడు. ఓ ఇంట్లో తలుపులు వేసుకొని దాక్కున్నా కూడా అతన్ని పట్టుకొని అతి కిరాతకంగా నరికేశారు. కాగా గత రెండు రోజులుగా కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

 కాగా పదిహేనేళ్ల క్రితం ఇదే విధంగా గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు మిద్దె రవీందర్‌ను హత్య చేసినట్టు గ్రామస్థులు చెబుతున్నారు.దీంతో ఫ్యాక్షన్ కక్షలు మరోసారి మొదలయ్యాయని గ్రామస్తులు భయపడిపోతున్నారు. అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దాడికి పాల్పడిన నిందితుల కోసం గాలిస్తున్నారు.