ఓ హత్య కేసులో ముంబై పోలీసులు నిందితుడిని జైలులోనే పెట్టుకుని దేశమంతా వెతికారు. అలా ఒకటి, రెండేళ్లు కాదు.. ఏకంగా 20 ఏళ్లు. ఆ తరువాత మరో కేసులో ఆ నిందితుడు అరెస్టయి గత ఐదేళ్లుగా జైలులోనే ఉన్నాడని తెలిసి అవాక్కయ్యారు. పోలీసులే కాదు న్యాయమూర్తి ఏఎమ్ పాటిల్ కూడా షాక్ అయ్యారు. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తంచేశారు. దీంతో ఈకేసును ‘అన్‌సాల్వ్‌డ్ మిస్టరీ’గా అభివర్ణించారు.
చోటా షకీల్ గ్యాంగ్‌కు చెందిన షార్ప్‌షూటర్ మహిర్ సిద్ధిఖీ (43) అనే వ్యక్తి మరో వ్యక్తితో కలిసి 1999లో బాంబే అమన్ కమిటీ చీఫ్ వాహిద్ అలీఖాన్‌ను హత్య చేశాడు. ఆ తరువాత అక్కడనుంచి పారిపోయాడు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిద్థిఖీ కోసం గాలింపు మొదలుపెట్టారు. 1999 నుంచి 2019 వరకూ అతడి కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. చివరికి 2019లో మే 29న కొన్ని సస్పెన్స్, షాకింగ్ సంఘటనల మధ్య అతడిని అరెస్ట్ చేశారు.
చోటా షకీల్ ఆదేశాలతోనే సిద్ధిఖీ ఆ హత్య చేశాడని..ఇక అప్పటినుంచి పోలీసుల కళ్లు కప్పి తిరుగుతూ ఉన్న అతడిని అరెస్ట్ చేసినట్టు కోర్టుకు సమర్పించిన చార్జ్‌షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. ఈకేసు విచారణ చేపట్టిన మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైం యాక్ట్ కేసుల స్పెషల్ జడ్జి ఏఎం పాటిల్.. పోలీసుల పనితనం, వారు ఏ విధంగా అరెస్ట్ చేశారనే విషయాలను బయటపెట్టారు. పోలీసులు నిందితుడు సిద్దిఖీని 2019లో అరెస్ట్ చేయగా..అంతకుముందు అంటే 2014 సెప్టెంబర్ 3 నుంచి సిద్ధిఖీ ఐదేళ్లపాటు మరో కేసులో అతడు అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నట్టు గుర్తించారు. సీఐడీ పోలీసులు సిద్ధిఖీని అరెస్ట్ చేసి అండర్ జైల్లో పెట్టారు. అంటే ఐదేళ్లుగా జైల్లోనే ఉన్న నిందితుడి కోసం పోలీసులు.. అంతకుముందు 15 ఏండ్లు.. అతడు అరెస్ట్ అయ్యాక మరో 5 ఏండ్లు.. మొత్తం 20 ఏళ్లు గాలించారని వెల్లడైంది. దీనిపై న్యాయమూర్తి పాటిల్ అసహనం వ్యక్తంచేశారు. రికార్డులు పక్కాగా ఉన్నప్పటికీ నిందితుడిని పోలీసులు గుర్తించటంలో విఫలమయ్యారంటూ చీవాట్లు పెట్టారు.