యశ్ హత్యకు ప్లాన్ చేసిన రౌడీషీటర్ ఎన్‌కౌంటర్ - MicTv.in - Telugu News
mictv telugu

యశ్ హత్యకు ప్లాన్ చేసిన రౌడీషీటర్ ఎన్‌కౌంటర్

February 28, 2020

Yash.

కేజీఎఫ్‌ సినిమాతో స్టార్‌డమ్ సంపాదించుకున్న రా‌క్‌‌స్టార్ యశ్ హత్యకు ప్లాన్ చేసిన వారిలో ప్రధాన నిందితుడు స్లమ్ భరత్ అనే రౌడీ షీటర్‌ను బెంగుళూరు పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. హత్య, హత్యాయత్నం సహా 50కి పైగా క్రిమినల్​ కేసుల్లో దోషిగా ఉన్న స్లమ్ భరత్‌ను రెండు రోజుల క్రితం యూపీలో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కర్ణాటకకు తీసుకొచ్చి క్రైమ్ సీన్ రీ కన్ష్‌స్ట్రక్షన్‌ చేస్తున్న సందర్భంలో భరత్ తప్పించుకున్నాడు. తన దగ్గర ఉన్న గన్‌తో పోలీసుల పైకి కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ ఎస్సై పైకి దూసుకుపోగా.. మరో బుల్లెట్ వెహికల్‌కు తాకింది. బల్లెట్ ప్రూప్ జాకెట్ వాడటంతో ఎస్సైకి ప్రాణహాని తప్పింది. సినీఫక్కీలో నిందితుడు అక్కడినుంచి కారులో పారిపోవడానికి  ప్రయత్నించాడు. పోలీసులు అతడిని చాలా దూరం వరకు వెంబడించారు. 

హేసరఘట్ట వద్ద మరోసారి నిందితుడు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ క్రమంలో భరత్ కాలులోకి, పొత్తి కడుపులోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. తీవ్రంగా గాయపడిన అతడిని పోలీసులు సప్తగిరి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడినుంచి విక్టోరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే స్లమ్ భరత్ మృతి చెందాడు. 2019 మార్చి7న స్లమ్​ భరత్ అతని అనుచరులు కలిసి కేజీఎఫ్​ హీరో యశ్​ను హత్య చేసేందుకు కుట్ర పన్నారు. అయితే వారి ప్లాన్‌ను ముందుగానే పసిగట్టిన పోలీసులు వారందరినీ అరెస్టు చేశారు. ఆ తర్వాత భరత్ బెయిల్‌పై విడుదల అయ్యాడు.