Cops Use Bulldozer to Help Woman Return to In-Laws' Home in UP
mictv telugu

బుల్డోజర్ దిద్దిన కాపురం.. కోడల్ని అత్తారింటికి పంపింది

August 31, 2022

ఉత్తర్ప్రదేశ్లో అక్రమంగా నిర్మించిన ఇళ్లు, భవనాలను కూల్చడానికి బుల్డోజర్లను ఉపయోగిస్తోంది యోగి ప్రభుత్వం. అయితే వరకట్నం కోసం వేధించి.. అత్తారింటి నుంచి గెంటేసిన ఓ మహిళకు సాయం చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు బుల్డోజర్‌ను తెప్పించారు. స్థానికంగా ఈ ఘటన వినోదాన్ని కలిగించింది. ఓ 30యేళ్ల మహిళను అత్తామామల ఇంట్లోకి పంపించేందుకు పోలీసులు బుల్డోజర్లతో రావడం.. అక్కడి జనాలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఉత్తరప్రదేశ్‭లోని బిజ్నోర్ జిల్లా హల్దౌర్‌ పోలీస్‌స్టేషను పరిధిలోని హరినగర్‌లో జరిగిందీ ఘటన.

ఇంతకీ విషయం ఏంటంటే.. నూతన్ మాలిక్ అనే మహిళకు కొద్ది సంవత్సరాల క్రితం రాబిన్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే వివాహం సమయంలో అంతటా జరిగినట్టే కొంత ఇచ్చిపుచ్చుకోవడాలు, పెట్టుపోతలు జరిగాయి. ఇవి కాకుండా తమకు 5 లక్షల రూపాయల బొలెరో కావాలని భర్త డిమాండ్ చేశాడు. కట్నం డిమాండ్‭తో అత్తింటివారంతా కలిసి మాలిక్‭ని వేధించడం ప్రారంభించారు. అయితే మాలిక్ కుటుంబం వారి డిమాండ్ నెరవేర్చకపోవడంతో ఆమెను 2019లో ఇంట్లో నుంచి గెంటివేశారు.

అప్పటి నుంచి మాలిక్ వారి పుట్టింట్లోనే ఉంది. రాబిన్ కుటుంబంతో పలుమార్లు మాట్లాడినప్పటికీ ప్రయోజనం దక్కలేదు. దీంతో వారు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన కోర్టు.. ఆమెను అత్తింటివారి ఇంట్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.. ఆదేశాలు వచ్చి 15 రోజులు గడుస్తున్నా ఆ అత్తగారింటివారు కోడల్ని ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో పోలీసులు బుల్ డోజర్లు, మైకులతో వారు ఉంటున్న వీధిలోకి వచ్చారు. మైక్ లో అనౌన్స్ మెంట్స్ చేశారు. తలుపులు తీయకపోతే బుల్ డోజర్లు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. ఇక చేసేదేమీ లేక ఆమెను ఇంట్లోకి ఆహ్వానించారు.