Corbevax approved as booster for those jabbed with Covishield, Covaxin
mictv telugu

కొవాగ్జిన్, కొవిషీల్డ్ తీసుకున్న వారికి కోర్బెవాక్స్ బూస్టర్

August 11, 2022

దేశ‌వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా కేంద్రం బూస్టర్ డోసులు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్‌లను రెండు డోసులు తీసుకున్న వారికి బూస్టర్ డోసుగా కోర్బెవాక్స్ వ్యాక్సిన్ ఇవ్వడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. 18 ఏళ్లకు పైబడిన వారు కోవాగ్జిన్ గానీ, కోవిషీల్డ్ గానీ రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత కోర్బెవాక్స్‌ను బూస్టర్ డోసుగా ఇవ్వొచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించారు. తాజా నిర్ణయానికి సంబంధించి ‘కోవిన్’ పోర్టల్‌లో మార్పులు కూడా చేయబోతున్నారు. ఈ వ్యాక్సిన్‌ను హైదరాబాద్ కంపెనీ అయిన ‘బయోలాజికల్ ఈ’ అనే సంస్థ రూపొందించింది. ఆర్‌బీడీ ప్రొటీన్ ఆధారంగా దేశంలో రూపొందించిన తొలి టీకా ఇదే. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ను 12-14 ఏళ్ల వయసు కలిగిన చిన్నారులకు ఇస్తున్నారు.

అయితే, 18 సంవత్సరాలు దాటిన వారికి బూస్టర్ డోసుగా ఇచ్చేలా ప్రయోగాలు నిర్వహించి, విజయం సాధించింది. దీనికి సంబంధించిన ఫలితాల్ని పరిశీలించిన ప్రభుత్వ కమిటీ.. ఈ వ్యాక్సిన్‌కు ఆమోదముద్ర వేసింది. దీంతో బూస్టర్ డోసుగా ఇచ్చేందుకు కేంద్రం అనుమతించింది. తమ ఔషధానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో సంస్థ ఎమ్‌డీ మహిమా దల్తా హర్షం వ్యక్తం చేశారు.