'మాంటెలుకాస్ట్‌'తో కరోనా కట్టడి.. ఐఐఎస్‌సీ - MicTv.in - Telugu News
mictv telugu

‘మాంటెలుకాస్ట్‌’తో కరోనా కట్టడి.. ఐఐఎస్‌సీ

April 26, 2022

దేశవ్యాప్తంగా మళ్లీ ఆందోళన కల్గిస్తున్నా కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు బెంగళూరులో ఉన్న ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) పరిశోధకులు కీలక విషయాన్ని తెలియజేశారు. వారు నిర్వహించిన సర్వేలో ఆస్తమా చికిత్సలో భాగంగా ఉపయోగించే ఔషధం ‘మాంటెలుకాస్ట్’ సార్స్ కోవిడ్‌ను కట్టడి చేయడానికి సాయపడుతుందని తెలిపారు. ఆస్తమా, హే ఫీవర్, హైవ్స్‌లో సాధారణంగా ఊపిరితిత్తుల్లో వాపు సమస్య ఏర్పడుతుంది. దీన్ని తగ్గించడంలో మాంటెలుకాస్ట్ మంచి ఫలితాలను ఇస్తున్నట్టు ఐఐఎస్‌సీ శాస్త్రవేత్తలు గుర్తించారు.

శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం.. ”ఈ ఔషధం సార్స్ కోవిడ్ ప్రొటీన్ అయిన ఎన్ఎస్‌పీ1ని గట్టిగా బంధిస్తుంది. మానవ కణాల్లోకి ముందుగా ప్రవేశించే ఎన్ఎస్‌పీ1ను అడ్డుకుంటుంది. ఈ ప్రొటీన్ మన రోగనిరోధక కణాల లోపల ప్రొటీన్-తయారీ యంత్రాలను రైబోజోమ్‌లతో బంధించగలదు. రోగ నిరోధక వ్యవస్థకు కీలకమైన ప్రొటీన్ల సంశ్లేషణను అడ్డుకుంటుంది. ఫలితంగా కరోనా వైరస్ ప్రొటీన్ అయిన ఎన్ఎస్‌పీ1 బలహీనపడుతుంది” అని వారు అన్నారు.

ఈ అధ్యయన వివరాలు జర్నల్ ‘ఈ లైఫ్’లో ప్రచురితమయ్యాయి. కరోనా ఏ వేరియంట్‌లో అయినా, వైరస్ ప్రొటీన్ అయిన ఎన్ఎస్పీ1 పెద్దగా మార్పు చెందడం లేదని, దీన్ని లక్ష్యంగా చేసుకునే ఔషధాలు ఏవైనా అన్ని కరోనా వేరియంట్లకూ చికిత్సగా పనికి వస్తాయని పరిశోధక బృందం అభిప్రాయపడింది.