మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. రూ. 500 జరిమానా - MicTv.in - Telugu News
mictv telugu

మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. రూ. 500 జరిమానా

April 20, 2022

15

కరోనా మహమ్మారి భారత్‌లో మళ్లీ విజృంభిస్తుంది. రెండు సంవత్సరాలపాటు యావత్ ప్రపంచాన్ని అతలకుతలం చేసిన మహమ్మారి.. గతకొన్ని నెలలుగా తగ్గుముఖం పడుతుండడంతో ప్రజలు మళ్లీ సాధారణ జీవితాలకు అలవాటుపడ్డారు. ఆర్థికంగా నష్టపోయిన వ్యాపార సంస్థలు ఇప్పుడిప్పుడే లాభాల బాట పట్టాయి. సంవత్సరాలపాటు మూతపడిన పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు ఇప్పుడిప్పుడే కళకళలాడుతున్నాయి. ఇటువంటి సమయంలో కరోనా మళ్లీ వ్యాపిస్తుంది. దీంతో ప్రజలు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు.

ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ విపరీతంగా వ్యాపిస్తుంది. గతవారం రోజులుగా పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనాతో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండటం ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం.. కోవిడ్‌ పరిస్థితిపై చర్చించేందుకు బుధవారం డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఆథారిటీతో వైద్యారోగ్యశాఖ అధికారులు సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో మాస్క్‌ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. మాస్క్‌ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే రూ. 500 జరిమానా విధించనున్నట్లు వెల్లడించింది. అలాగే, పాఠశాలలను మూసివేయకూడదని అధికారులు నిర్ణయించారు. అయితే వైరస్‌ కట్టడికి నిపుణులతో చర్చించి ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ జారీ చేస్తామని పేర్కొంది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలను, టీకా పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అరవింద్‌ కేజ్రీవాల్‌ అధికారులను ఆదేశించారు.

మరోవైపు దేశ వ్యాప్తంగా మంగళవారం 4.21 లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా, 2,067 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. పాజిటివిటీ రేటు 7.72 శాతంగా ఉందని, కొత్తగా మరణాలు ఒక్కటి కూడా సంభవించలేదని అధికారులు తెలిపారు.