కల్లోల కరోనా.. దేశంలో 6 లక్షలు దాటిన కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

కల్లోల కరోనా.. దేశంలో 6 లక్షలు దాటిన కేసులు

July 2, 2020

Corona Cases Update July 2nd

భారత్ కరోనా కేసుల్లో మరో మైలు రాయిని దాటేసింది. ఏకంగా ఆరు లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. లాక్‌డౌన్, క్వారంటైన్, ముందు జాగ్రత్త చర్యలు ఎన్ని తీసుకున్నా ఫలితం మాత్రం ఉండటం లేదు. రోజు రోజుకూ వ్యాధిబారిన పడుతున్నవారు ఎక్కువ అవుతూనే ఉన్నారు. గడిచిన 24 గంటల్లో నమోదైన వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ లెక్కన చూస్తే దేశంలో నిన్న ఒక్కరోజే 19,148 మందికి కొత్తగా వ్యాధి నిర్ధారణ అయింది. 434 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,04,641కు చేరుకుంది.17,834 మహమ్మారి కాటుకు బలి అయ్యారు. 

కేసుల సంఖ్య పెరుగుతున్నా రికవరీలు కూడా అదే స్థాయిలో పెరగడం కొంత ఊరట కలిగించే విషయం. ఇప్పటి వరకు వ్యాధి సోకిన వారిలో 3,59,859 మంది బాధితులు కోలుకున్నారు. ఇంకా 2,26,947 మంది ఆయా రాష్ట్రాల కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 60 శాతంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా మహారాష్ట్ర, తమిళనాడు,ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అవుతున్నాయని తెలిపారు. 

మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా చూసినా కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తూనే ఉంది. వైరస్ ఉదృతి రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 1,08,03,599 మందికి వ్యాధి సోకింది. ఇక మరణాల విషయానికి వస్తే 5,18,968 ప్రాణాలు కోల్పోయారు. 64,57,985 మంది కోలుకోగా.. 43,45,614 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక అగ్రరాజ్యం అమెరికాను వైరస్ కుదిపేస్తోంది. అక్కడ నిన్న ఒక్కరోజే ఏకంగా 52,898 మందికి పాజిటివ్‌ అని తేలింది. ప్రపంచ వ్యాప్తంగా పోల్చితే అక్కడే 30 శాతం కేసులు ఉన్నాయి. దీంతో అమెరికాలో 27,79,953 మంది వ్యాధిబారిన పడగా.. 1,30,798 మంది మరణించారు. 

Corona Cases Update July 2nd