ఉద్దీపన కాదు కాదు.. ఒట్టి అప్పు ఇప్పిస్తారంట
కేంద్రం ప్రకటించిన రూ. 20 లక్షల ఆర్థిక ప్యాకేజీ ఒట్టి ప్రసహనంగా మారింది. కాలే కడుపులకు తక్షణ సాయం చేయకుండా దీర్ఘాకాలిక భవిష్యత్తు, దార్శినికత అంటూ ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ చేస్తున్న ప్రకటనలను అర్థం చేసుకోడానికి తలపండిన ఆర్థిక వేత్తలు బుర్ర చించుకుంటున్నారు.
మొన్న 12 వ తేదీన ప్రధాని మోదీ జాతికి ఇచ్చిన లాక్‌డౌన్ సందేశంలో… ‘దేశం సంక్షోభంలో ఉంది కాబట్టి దేన్నీ వదలనట్టే దీన్ని కూడా ఒక అవకాశంగా తీసుకోండి. ఆత్మ నిబ్బర భారతాన్ని తయారు చేయాలి….’ అని గొప్పగా చెప్పారు. కానీ ఘనమైన ఆర్థిక ప్యాకేజీ విధి విధానాలు, ఎన్ని పైసలు ఎక్కడ ఖర్చు చేస్తారు లాంటి వివరాలు చెప్పలే. దేశాన్ని ఉర్రూతలు ఊగించలేకపోయినా ఉత్సాహ పరిచే ప్రయత్నమైతే చేశారు. జమా పద్దుల లెక్కలను నిర్మలమ్మ మూడు రోజుల నుంచి ఊదరొగడుతున్నారు. చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు ఊతం ఇవ్వడానికి భారీగా రుణాలు ప్రభుత్వ గ్యారెంటీతో ఇస్తామని, ఇంకా పీఎఫ్ సొమ్ములు, ఆదాయపన్ను మినహాయింపులని వివరంగా చెప్పుకొచ్చింది అమ్మ. ఇందులో భాగంగానే అసలు ప్యాకేజీలో ఎం ఉందో చెప్పకనే చెప్పింది.
ఇందులో ప్రధానమైన అంశాలు ఇవే..
బ్యాంకింగ్ కంపెనీలకు, పవర్ సెక్టార్‌లకు కొంత ద్రవ్య వినిమయ చర్యలు ప్రకటించినా ప్రధానంగా సూక్ష్మ, చిన్న, మధ్య రకం పరిశ్రమలకు ప్యాకేజి ఫలాలు వస్తాయని సెలవిచ్చారు. ఈ మొత్తం ఉద్దీపన చర్యల విలువ నిన్న చెప్పిన వివరాల్లో 6 లక్షల కోట్లు ఐతే వాస్తవానికి ప్రభుత్వానికి అయ్యే అసలు ఖర్చు రూ. 16500 నుంచ ిరూ. 55000 కోట్లు మాత్రమే అని వ్యాపార నిపుణులు అంటున్నారు. ఎలాగంటారా
నిర్మలమ్మ చెప్పిన చాలా చర్యలు అప్పిప్పించే లేదా దివాలాకు దగ్గర ఉన్న ఆయా పరిశ్రమలకు అప్పు చెల్లించే సమయంలో కొంత వెసులుబాటు ఇచ్చే చర్యలే. అసలు అప్పు బ్యాంకులు ఇస్తాయి. ప్రభుత్వం ఓ మాట చెబుతుంది, అంతే. బ్యాంకుల దగ్గర ఎలాగూ పైసలు బోలెడు మూలుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వానికి పోయేదేమీ ఉండదు. ఇప్పటికే కొంత మంది బడా పారిశ్రామిక వేత్తలు కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు చెక్కేసిన ఏమీ చేయలేక రుణ మాఫీ చేశారన్నది వేరే సంగతి. మొత్తానికి ఈ అప్పుల ప్యాకేజీతో ప్రభుత్వానికైతే పోయేదేమీ లేదు.
ప్రధాన ఆర్ధిక సలహాదారు సంజీవ్ సన్యాల్ ప్రకారం…. మోదీ గవర్నమెంట్ చిన్న పరిశ్రమలు ఎదుర్కొంటున్న తక్షణ ఆర్ధిక అడ్డంకులు తొలగించడానికి వాళ్లకు కావలసిన డబ్బులు అప్పు తీసుకునే అవకాశం కల్పిస్తారన్న మాట. ఈ పరిశ్రమలు ఇప్పటికే నిండా మునిగాయి. ఇప్పుడు తల కొంచం పైకి లేపి మళ్లీ ఈత మొదలెడతాయి. వాళ్ళ కూలీలకు కొంత జీతభత్యాలు కూడా అందజేస్తాయి. ఐతే ఈ సూక్ష్మ, చిన్న, మధ్య రకం పరిశ్రమలు వాస్తవానికి ఎలా లాభపడతాయి?
ఆత్మా నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీలో ఉన్న చాలా చర్యల్లో కొన్ని అసలు గవర్నమెంటుకు సంబంధం లేనివి. రిజర్వు బ్యాంకే మొత్తం చూసుకుంటుంది. ఎంతవరకు అంటే గిఫ్టులో మొత్తం సరుకు కంటే ప్యాకేజీ పదార్ధం ఎక్కువ అనేట్టు. నైవేద్యం పల్లెంలో పువ్వులు, పత్రి పోగా మిగిలిన ప్రసాదం ఎంత అంటే ఇంత అన్నట్టు మొత్తం కలిపితే అంత.
రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా లెక్కల ప్రకారమే ప్యాకేజీ కోసం ప్రభుత్వం ఖర్చు చేసేది దాదాపు 1. 5 లక్షల కోట్లేనంట. అందులో ముఖ్యంగా లాక్ డౌన్‌తో తీవ్రంగా నష్టపోయిన వలస కూలీలు, రైతులకు ఇందులో ఏమైనా దక్కుతుందేమో చూడాలి.
అసలు చిన్న పరిశ్రమల విషయానికే వస్తే.. అవి డిమానిటైజేషన్ కాలం నుంచే చితికిపోవడంమొదలైంది. ఐతే ఇప్పుడు పడిన దెబ్బ కోలుకోలేనిది. భారతదేశంలో ఎక్కువ శాతం పరిశ్రమలు చిన్నచిన్న మార్జిన్లతో నడుస్తూ ఉంటాయి. ఒక పెద్ద ఉత్పాతాన్ని తట్టుకుని నిలబడేంత సత్తువ వాటి దగ్గర ఉండదు. లాక్ డౌన్ వంటి సమయాల్లో ఉత్పత్తిని, సేవల్ని అమ్ముకోలేవు. తమ వద్ద పని చేసే కార్మికులకు కనీసం ఒక నెల జీతాలిచ్చే పరిస్థితిలో కూడా ఉంటాయని ఆశించలేం. అసలు విషయం ఏమిటంటే భారత దేశంలో ఎక్కువ ఉద్యోగాలు ఉండేది ఈ పరిశ్రమల్లోనే. బడా పరిశ్రమల్లో కొలువులు అందరికి లేవు.
ఇప్పుడు ఈ MSME (సూక్ష్మ, చిన్న, మధ్య రకం పరిశ్రమలు)లకు 3 లక్షల కోట్ల వరకు రుణ సదుపాయం అందనుంది. ఈ డీల్ 25 కోట్ల అప్పులు ఉన్న పరిశ్రమలు, 100 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ ఉన్న పరిశ్రమలకు వర్తిస్తుంది. ఐతే ఈ మొత్తాన్ని ఆ పరిశ్రమలకు ఇచ్చేది ప్రభుత్వం కాదు. అదే అసలు విషయం.
ఉదాహరణకు ఓ కంపెనీ కోటి రూపాయలు ఋణం బ్యాంకులో తీసుకోవాలని అనుకుంటే ప్రభుత్వం పెద్ద మనిషి లాగ ఉండి బ్యాంకులకు భరోసా ఇస్తాయి. అంటే బ్యాంకులు రుణ ఎగవేత గురించి భయపడనవసరం లేదన్నమాట. రుణాలు ఎగ్గొడితే ఆ తల నొప్పి ప్రభుత్వానిది. ఈ తక్షణ రుణ సాయం మొత్తం కంపెనీల రుణ సాయంలో 20 శాతం అన్నమాట. రిజర్వు బ్యాంకు లెక్కల ప్రకారం మార్చి ఒకటి 2020 నాటికి మొత్తం కంపెనీల రుణ పరిమితి 14 లక్షల కోట్లు ఐతే అందులో 20 శాతం 2.8 లక్షల కోట్ల వరకు తక్షణం వస్తుంది.
ఈ చర్య వల్ల దాదాపు 45 లక్షల ఎంఎస్ఎంఈలు లాభపడతాయని నిర్మలమ్మ చెబుతోంది. ఇది ఒక రకంగా ఆయా పరిశ్రమల్లో పని చేసే ఉద్యోగస్తులకు ఊరట నిచ్చేదే.
రెండో చర్య ఇప్పటికే రుణాలు కట్టలేక అవస్థలు పడుతున్న దివాలా తీసిన చిన్న పరిశ్రమలకు 20 వేల కోట్ల నిధితో రుణాలు అదనంగా అందనున్నాయి. ఈ డబ్బులు కూడా ఇచ్చే రుణదాతలు మళ్లీ బ్యాంకులు లేదా రుణ సంస్థలే. ప్రభుత్వం గ్యారెంటీ మాత్రం ఇస్తుంది.
ఇక చివరి చర్యగా ప్రభుత్వం 50 వేల కోట్ల నిధి సమకూర్చుకుని అర్హత ఉన్న పరిశ్రమల్లో వాటా పెడుతుంది. తద్వారా అవి మరింత ఉత్పత్తిని సాధించి అభివృద్ధి చెందుతాయని అంచనా. ఇందులో ప్రభుత్వ వాటా 10 వేల కోట్లు ఐతే ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా, ఎల్‌ఐసీ లాంటి సంస్థలు అందజేస్తాయి.
ఇంకాఎంఎస్ఎంఈ పరిధి విస్తరించేందుకు, వాటినన్నిటిని ఒకే పరిధిలోకి తెచ్చేందుకు సంబంధించిన విధాన పరమైన ప్రకటనలు కూడా ఉన్నాయి. ఎంఎస్ఎంఈలను నిర్వచించే పరిధిని పెంచి ఎక్కువ పరిశ్రమల్ని అందులో చేర్చుకోబోతున్నారంటే మరి చిన్న పరిశ్రమలు కాకపోయినా పరవాలేదు అనే అర్థంలో చేసిన అస్పష్ట ప్రకటన ఒకటి. అంటే దానర్థం ఇప్పుడున్న దానికంటే ఎక్కువ కంపెనీలకు సబ్సిడీలు వస్తాయని కావొచ్చు
రెండోది కొంత చర్చను లేవనెత్తెదిగా ఉంది. 200 కోట్ల తక్కువ పరిధి ఉన్న గవర్నమెంట్ టెండర్లలో విదేశీ కంపెనీలకు అనుమతి లేదన్న విషయం. అంటే స్వదేశీ కంపెనీలకే ఆ అవకాశం దక్కనున్నది అనే అర్థం వస్తున్నది. కానీ అసలు స్వదేశీ కంపెనీలను ఎలా నిర్వచిస్తారన్నది ప్రశ్న? కొన్ని ప్రత్యేక అవసరాలకు విదేశీ టెక్నాలజీ మాత్రమే దిక్కు ఐనప్పుడు పరిస్థితి ఏమిటన్నది నిపుణుల సందేహం.
ఇవి కాకుండా ప్రత్యేకంగా చిన్న కంపెనీలకే 4 వేల కోట్ల రూపాయలతో ట్రస్ట్ ఏర్పాటు , 2500 కోట్ల విలువైన ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపులు యాజమాన్యం తరపు నుండి, కార్మికుల తరపు నుండి ప్రభుత్వమే కొంత కాలం పాటు చేస్తుందనే ప్రకటన. ఇవి కాకుండా ప్రభుత్వమే స్వయంగా చొరవ తీసుకుని ఒక 10 వేల కోట్ల పెట్టుబడి ఈ పరిశ్రమలలో పెట్టడం ఆసక్తకర అంశం.
వ్యవసాయం, దాని ఆధారిత సంస్థలను బలోపేతం చేయడానికి మౌలిక వసతుల కల్పన కోసం సుమారు 1.63 లక్షల కోట్ల ప్యాకేజిని ప్రకటించారు. అయితే ఇది కూడా రైతాంగం తక్షణం ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని పరిష్కరించేలా లేదు.
ఇందులో సుమారు లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక వసతుల నిధిని ఏర్పాటు చేసి దాని ద్వారా సాగు చేసిన పంటను కొనుగోలు వాటి నిర్వహణ కోసం వినియోగించనున్నారని చెప్పారు.
లక్షకోట్లను వ్యవసాయ ఉత్పత్తులు చేసేవారికి, వాటిని సేకరించేవారికి ఉత్పత్తి సంఘాలకు, సహకార సంఘాలకు , వ్యాపారులకు, వ్యాపారసంస్థల కోసం ఉపయోగించనున్నట్టు తెలిపారు. దీన్ని కూడా ఈ నిధిని కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని అన్నారు.
ఇవే కాకుండా సూక్ష్మ అహార పరిశ్రమలు, పశువుల వాక్సినేషన్, పాల ఉత్పత్తి రంగాలకు, ఔషధ మొక్కల సాగు, తేనే ఉత్పత్తిదారులు, కూరగాయలు , పండ్లు సాగు చేసే వారికి కూడా కొన్ని స్కీములను ప్రకటించారు.
పంట నిల్వలు చేయడానికి సరైన గిడ్డంగుల వ్యవస్థ లేనందువల్ల వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయని నిర్మల చెప్పారు. ఇంకా 10 వేల కోట్లతో మైక్రో ఆహార ఉత్పత్తులు, ఆర్గానిక్, హెర్బల్, పౌష్ఠిక విలువలు పెంచే ఉత్పత్తులు నిర్వహణ కోసం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన ద్వారా కోట్లతో జాలర్ల కోసం 20 వేలకోట్లను ఉపయోగించనున్నట్టు చెప్పారు. దీని ద్వారా 55 లక్షల మందికి ఉపాధి అవకాశాలు రానున్నట్టు ఎగుమతులు లక్ష కోట్లకు పెరుగుతాయని అంచనా వేశారు.
15 వేల కోట్లతో పశు సంక్షేమం కోసం, పాల ఉత్పత్తుల పశు పోషణ రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడం లక్షంగా ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. హెర్బల్ మొక్కల సాగును ప్రోత్సహిస్తామని, దానికిసం గంగానది పరివాహక ప్రాంతాల్లో ఒక ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయడానికి 4 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్టు సమాచారం. మరో 5 వందలో కోట్లు ప్రత్యేకంగా తేనెటీగల నిర్వహణ రంగానికి వెచ్చించనున్నట్టు తెలిపారు.
కూరగాయల సాగు చేసేవారికి 5 వందల కోట్ల నిధితో వాటి రవాణా, కోల్డ్ స్టోరేజీల నిర్వహణ చేయనున్నారని ప్రకటించారు. వీటన్నిటి చర్యల ద్వారా రైతుల భాదలు తీరనున్నాయని అమ్మ సెలవిచ్చారు
ఇదేదో వ్యవసాయ బడ్జెట్‌లాగా ఉందే అని కొంత మంది వ్యవసాయ నిపుణులు సందేహం వెలిబుచ్చారు. బడ్జెట్‌తో బాధలు తీరుతాయా అంటే ఏ ఏటికాయేడు తీరినట్టే తీరుతాయి. ఐతే లచ్చిందేవికి మొక్కవలసిందే ఇంక. దీనితో కనీసం రెండు మూడు నెలల్లో రైతులకు ఏమైనా ఒరుగుతుందా అంటే కష్టమే ? బడ్జెట్ విశ్లేహకులకు, నిపుణులకు నోటి తుత్తర తీరుతుందా? ఇదంతా లెక్కల మాయ అనేవాళ్ళు లేక పోలేదు.
‘‘ఖాళీ
ప్యాకేజి
ప్యాకెట్లు
అమ్మబడును’’
అని శ్రీశ్రీ ఏదో కవితావేశంలో అన్నాడు. కానీ, నిజంగానే అమ్మేయొచ్చు.
మొత్తానికి ఈ ప్యాకేజి భారం చాలా తక్కువ శాతం ప్రభుత్వం పైన పడనుంది. రుణాలు చెల్లించేలేక పోతే వచ్చే సమస్య కొన్ని సంవత్సరాల తర్వాత ముచ్చట. విద్యుత్ రంగాల్లోనైతే ఈ భారం రాష్ట్రప్రభుత్వలపైన పడుతుంది.
ఆదాయ పన్ను చెల్లింపుల్లో ఉపశమన కల్పించడం వల్ల కూడా కేంద్రానికి వచ్చే తక్షణ నష్టం ఏమీ ఉండదు.మొత్తానికి కేంద్రం పరిశ్రమల అవసరాల కోసం విదిల్చేది 55,500 కోట్లు ప్లస్ 24000 కోట్లు దాదాపు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు.
నిర్మలమ్మ చేసిన మూడు ప్రకటనల్లోని మొత్తాన్ని కలుపుకుంటే 240 బిలియన్లు (జీడీపీలో 0. 2 శాతం) మించదని అర్థం చేసుకోవచ్చు. వెరసి ఇరవై లక్షల కోట్ల ప్యాకేజి మేడి పండు రహస్యం ఇంతే. నిజానిజాలు రాబోయే కాలం లో ఇచ్చే గ్యారెంటీలను బట్టి ఉంటాయి. .
ఇంక అసలు విషయం ప్రజలకు చేతిలో డబ్బులు ఆడితేనే కొనుగోలు చేస్తారు. అప్పుడు మాత్రమే ఉత్పత్తిరంగం బతికి బట్ట కడుతుంది. ప్రజలకు డబ్బు రావాలంటే వారికి పని కల్పించాలి. పని చేసే చోట గొరవ మర్యాదల్ని, భద్రతనీ కలిగించాలి. అసలు ఉన్న కార్మిక చట్టాలనే ఊడబెరుకుతున్నప్పుడు లేదా పని చేసే మనుషులని ఆవమానాలకు గురి చేస్తున్నప్పుడు, డిమాండ్ ఎలా పెరుగుతుంది. ఇంకో విషయం అసలు అడుగే బయట పెట్టొద్దని, పెడితే ఉత్పాతమని భయపెట్టి, ఇప్పుడు బయటకొచ్చి డిమాండ్ పెంచమంటే ఎవర్ని ఎందుకు నమ్ముతారు జనం. కొండ నాలికకు మందు వేస్తె ఉన్న నాలిక ఊడిపోయినట్టు. కరోనా పోదు, దానితో సహజీవనo చేయాలన్నప్పుడు ఇంకా లాకులెందుకు, జనం నెత్తి మీద మేకులెందుకు? పోనీ ఆకలి కంటే ఆరోగ్యం ప్రధానమైనప్పుడు ప్యాకేజీలు, పౌడర్ డబ్బాలు ఎందుకు. రెండూ ముఖ్యం అంటారా ఐతే లాక్ చేసేందుకు తలుపు ఉండాలి. తలుపు వెనకాల ఇల్లు ఉండాలి. ఇంటి లోపల మనుషులు ఉండాలి. ఇల్లు వాకిలే లేని జనం కొన్ని కోట్ల మంది ఉన్న దేశంలో ఇంటికి బజారుకీ సరిహద్దులు చెరిగి పోక మానవు.