సిటీ బస్సులు వెలవెల.. మెట్రోలోనూ అంతంతే..   - MicTv.in - Telugu News
mictv telugu

సిటీ బస్సులు వెలవెల.. మెట్రోలోనూ అంతంతే..  

September 26, 2020

nvhgn

కరోనా వైరస్ ప్రజలకు కోలుకోలేని దెబ్బ కొట్టింది. తరతరాలు తన గురించి మాట్లాడుకునేలా? ఎప్పటికీ తను అంటే గజగజా వణికేలా చేసింది. ప్రజలు కరోనా సోకవద్దని చాలా జాగ్రత్తలు చేసుకుంటున్నారు. కరోనా వచ్చినవారి జీవితాలను దగ్గరగా చూశాక ఆ మహమ్మారి జోలికి చచ్చినా వెళ్లొద్దనే స్పృహ ఎక్కువైంది. ఈ క్రమంలో ప్రారంభం అయిన సిటీ బస్సుల్లో జనాలు ఎక్కడానికి వెనకాముందు ఆలోచిస్తున్నారు. బస్సుల్లో ఎక్కడం వల్ల కరోనా వైరస్ సోకుతుందనే భయం ఉంది. అన్‌లాక్ 4 ప్రక్రియలో భాగంగా అన్ని రాష్ట్రాల్లో అంతర్ రాష్ట్ర రోడ్డు రవాణా సర్వీసులు ప్రారంభించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించిన విషయం తెలిసిందే. అన్నీ రాష్ట్రాల్లో ఆర్టీసీ సర్వీసులు మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిటీ ఆర్టీసీ సర్వీసులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆరు నెలల నుంచి డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు నిన్న రోడ్డెక్కాయి. నగరంలోని 29 డిపోల నుంచి 639 ఆర్టీసీ బస్సులను తిప్పారు.

దీంతో ఇన్ని రోజులు ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఊరట లభించినట్లయింది. అదే సమయంలో కరోనా భయం కూడా ప్రజల్లో నెలకొంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కడ జరుగుతుందో అని ప్రజలు భయపడుతున్నారు. ఈ భయాల నడుమ నిన్న ఆర్టీసీ బస్సులో ఒక్క ప్రయాణికుడు కూడా ఎక్క లేదట. దీంతో ప్రయాణికులు లేక ఆర్టీసీ బస్సులు వెలవెలబోయినట్లు సమచారం.  ముందస్తు సమాచారం లేకపోవడం వల్ల కూడా ప్రయాణికులు బస్సుల్లో ఎక్కలేదని అధికారులు భావిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో ఆర్టీసీ ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

మెట్రో పరిస్థితి అంతంతే..

కరోనా ప్రభావంతో హైదరాబాద్ మెట్రోకు కూడా ప్రయాణీకులు కరువయ్యారు. మెట్రో సర్వీసులు ప్రారంభమై 20 రోజులు అవుతోంది. అయినా ఇంతవరకు ప్రయాణికులు లేక నగరంలోని మెట్రో స్టేషన్లు వెలవెలబోతున్నాయి. గతంలో ఉన్న స్థాయిలో ఇప్పుడు ప్రయాణికులు రావడంలేదు. గతంలో రోజుకు సుమారు మూడు లక్షల మంది ప్రయాణించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడంలేదు. ఇప్పుడు రోజుకు 20 వేల నుంచి 25 వేల మందే ప్రయాణిస్తున్నారు. కరోనా కారణంగా మెట్రో యాజమాన్యం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ప్రయాణికులు ఎక్కువగా తమ సొంత వాహనాల్లోనే ఆఫీసులకు వెళ్తున్నారు. కాగా, ఇన్ని రోజుల నుంచి మూసిఉన్న ఆర్టీసీ, మెట్రోలు తెరుచుకున్నాక, పుంజుకుంటాయా అంటే ఆ పరిస్థితి లేకుండాపోయింది.