లైన్‌మెన్‌ను బలిగొన్న కరోనా కంచె - MicTv.in - Telugu News
mictv telugu

లైన్‌మెన్‌ను బలిగొన్న కరోనా కంచె

March 26, 2020

Corona fence that incident linemen.

దేశంలో కరోనా మహమ్మారి ప్రబలకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజలు ఇళ్లల్లో ఉంటే దాని వ్యాప్తిని అరికట్టవచ్చనే నేపథ్యంలో పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ‘ప్రభుత్వాలు చేసేది మన మంచి కోసమే’ అని భావించని కొందరు నిర్లక్ష్యంగా ఇళ్ల నుంచి బయటకు వచ్చి సమస్యను కొని తెచ్చుకున్న వారు అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ గ్రామ సరిహద్దులో మనుషులు ఊరి దాటి రాకుండా వేసిన కంచెకు ఓ లైన్‌మెన్ బలి అయ్యాడు. ఈ విషాద ఘటన వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవర్ పల్లి మండలం ధర్మారం గ్రామంలో చోటు చేసుకుంది. ధర్మారం గ్రామానికి చెందిన రమేశ్ అనే వ్యక్తి అదే ప్రాంతంలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్నాడు. లైన్‌మెన్ అయిన రమేశ్ లాక్ డౌన్ సందర్భంలోనూ అత్యవసర సేవల్లో తన విధిని నిర్వర్తిస్తున్నాడు. 

తమ ప్రాంతంలో కరెంటు పోయిందని, పక్క గ్రామానికి చెందిన వారు రమేశ్‌కు ఫోన్ చేశారు. వెంటనే పక్క ఊరు జిల్గుకు వెళ్లి అక్కడ విద్యుత్ సరఫరా జరిగేలా చేసి, తిరిగి స్వగ్రామం ధర్మారానికి బైక్‌పై వస్తున్నాడు. అతను వస్తున్న మార్గంలో ఇతర గ్రామాల ప్రజలు తమ సరిహద్దుల్లో పైపులను కంచెలుగా వాడారు. రోడ్డుపై అడ్డుగా వాటిని వేసి ఉంచడంతో బైక్‌పై వెళ్తున్న రమేశ్.. పైపులు తగిలి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రమేశ్ మృతిచెందాడు. రమేశ్ మృతితో అతడి కుటుంబీకులు బోరున విలపిస్తున్నారు. గ్రామ ప్రజలు కూడా రమేశ్ సేవలను కొనియాడుతూ కన్నీరు మున్నీరు అవుతున్నారు.