జూన్ తర్వాత కరోనా ఫోర్త్ వేవ్ : ఆరోగ్య మంత్రి సంచలన ప్రకటన - MicTv.in - Telugu News
mictv telugu

జూన్ తర్వాత కరోనా ఫోర్త్ వేవ్ : ఆరోగ్య మంత్రి సంచలన ప్రకటన

April 26, 2022

దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగిపోతుండడంతో కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ సంచలన ప్రకటన చేశారు. కరోనా నాలుగో దశ జూన్ తర్వాత ఉండవచ్చనీ, దాని ప్రభావం అక్టోబర్ నెల వరకూ ఉంటుందని కాన్పూర్ ఐఐటీని ఉటంకిస్తూ పేర్కొన్నారు. మంగళవారం బెంగళూరులో మీడియాతో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా.. ‘గత రెండేళ్లుగా కాన్పూర్ ఐఐటీ వాళ్లు వేసిన అంచనా వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది.

వారి నివేదికలను మనం నమ్మవచ్చు. ఈ భూగోళం నుంచి కరోనా పూర్తిగా అంతమైపోతుందని చెప్పలేం. అందువల్ల మాస్క్ ధరించడం, వ్యాక్సిన్ వేయించుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటివి తప్పనిసరిగా చేయాలి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ముప్పు నుంచి కాపాడుకోవచ్చు. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ప్రధాని మోదీ బుధవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ భేటీలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చిస్తారు. బూస్టర్ డోసు ఉచితంగా పంపిణీ చేసే అంశంపై ప్రధాని రేపటి సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి’ అని వ్యాఖ్యానించారు.