మర్కజ్ మసీదులో అసలేం జరిగింది?  - MicTv.in - Telugu News
mictv telugu

మర్కజ్ మసీదులో అసలేం జరిగింది? 

March 31, 2020

Corona From Nizamuddin Religious Gathering

భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొత్తరూపు దాల్చింది. ఇప్పటి వరకూ విదేశాలకు వెళ్లి వచ్చిన వారి ద్వారా వైరస్ ప్రవేశించగా.. తాజాగా ఢిల్లీలోని మర్కజ్ మసీదులో జమాత్‌కు వెళ్లి వచ్చిన వారికి కూడా భారీ సంఖ్యలో  ఈ వైరస్ అంటుకుందని తేలింది. 75 దేశాలకు చెందిన వారితో మన దేశంలోని కొంత మంది కలిసి సామూహిక ప్రార్థనలు చేయడంతో ఈ మహమ్మారి సోకింది. ఇలా వెళ్లి వచ్చిన వారితో ఇది వివిధ ప్రాంతాలకు వైరస్ చేరింది. దీంట్లో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లి వచ్చిన వారు కూడా ఉన్నారు. ఇలా వెళ్లి వచ్చిన వారిలో ఇప్పటికే ఏపీలో ముగ్గురు, తెలంగాణలో ఆరుగురు మరణించడం ఒక్కసారిగా కలకలం రేపింది. 

తాజా అంచనాల ప్రకారం ఏపీ నుంచి దాదాపు 500 మంది మర్కజ్ వెళ్లి వచ్చినట్టుగా తెలుస్తోంది. జిల్లాల వారిగా ఈ లెక్కలు పరిశీలిస్తే..విజయనగరం3, విశాఖపట్నం రూరల్ఒకరు, విశాఖపట్నం 41,  నెల్లూరు 68, తూర్పుగోదావరి  27, పశ్చిమగోదావరి 16, ప్రకాశం 67, కృష్ణా 16, విజయవాడ 27, గుంటూరు అర్బన్ 45, గుంటూరు రూరల్ 43, కర్నూల్ 189,అనంతపురం 73, చిత్తూరు 20, తిరుపతి 16మంది  కడప 59 ఢిల్లీ వెళ్లి వచ్చినట్టుగా అధికారులు వెల్లడించారు.

 తబ్లిగి జమాత్‌‌లో ఏం చేస్తారు?

నిజామూద్దీన్ మర్కజ్‌లో జరిగిన తబ్లిగి జమాత్ కార్యక్రమానికి మన దేశంతో పాటు ప్రపంచ నలుమూల నుంచి ఇటీవల జమాత్ కోసం వచ్చారు. నిజాముద్దీన్ ప్రాంతంలో ఈ ప్రార్థనలు బ్రిటిష్ కాలం నుంచి సాగుతున్నాయి. మన దేశంలో ముస్లింలు తిరిగి హిందూమతంలో చేరకుండా అడ్డుకోడానికి తబ్లిగి మొదలైంద. హిందూమతం వదలి ముస్లిం మతాన్ని స్వీకరించిన వారిని ఆర్యసమాజ్ వంటి సంఘాలు తిరిగి హిందూమతంలోకి తీసుకొస్తున్నకాలంలో దీన్ని ఏర్పాటు చేశారు.  1926 -27 మధ్య మౌలానా ఇలియాస్ కంధల్వి నిజాముద్దీన్‌ మసీదులో తబ్లిగి జమాత్‌ను ఏర్పాటు చేశారు. తబ్లిగి అంటే అల్లా, జమాత్ అంటే సమూహం. అల్లా మాటలను ప్రచారం చేసే సమూహంగా మర్కజ్‌ మసీదులో జమాత్ ఏర్పాటు చేసేవారు. ఇలా వీరంతా మత ప్రచారం చేసేవారు. 

మర్కజ్ మసీదు సీల్.. కేసు : 

మర్కజ్ మసీదు నుంచే ఎక్కువగా కరోనా వ్యాప్తి చెందడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో మసీదు నిర్వాహకులపై కేసు నమోదు చేసింది ఢిల్లీ ప్రభుత్వం. వెంటనే మసీదును సీల్ చేసి కేసు నమోదు చేయాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు. కాగా ప్రార్థనల కోసం మసీదుకు 1500 నుంచి 1700 మంది వరకూ హాజరయినట్లు అంచనా వేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటివరకూ 1033 మందిని గుర్తించారు. వివిధ దేశాలకు చెందిన సుమారు 1200 మంది కూడా ఇక్కడికి వచ్చారు. వీరిలో రెండు వందల మందిని క్వారంటైన్‌కు తరలించారు.