Corona is a human creation.. America gave funds: Former Wuhan scientist
mictv telugu

కరోనా మానవ సృష్టే.. అమెరికా నిధులు ఇచ్చింది : వుహాన్ మాజీ సైంటిస్ట్

December 5, 2022

మూడేళ్ల కింద కరోనా వైరస్ క్రియేట్ చేసిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఉపాధి కోల్పోయి, ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలి ప్రపంచంలో కోట్ల మంది అనేక బాధలు పడ్డారు. ఎవరి నోట విన్నా బతికితే చాలురా భగవంతుడా అని మొరపెట్టుకునే పరిస్థితి. అయితే కరోనా వైరస్ పుట్టుక గురించి కచ్చితమైన సమాచారం ఏదీ లేదు. చైనాలోని వుహాన్ ల్యాబు నుంచి ఈ వైరస్ లీక్ అయిందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా చైనా వైరస్ అని సంబోధించడం అప్పట్లో సంచలనం రేపింది. కాగా, తాజాగా వుహాన్ ల్యాబులో కొంత కాలం పని చేసిన ఓ అమెరికన్ సైంటిస్ట్ కరోనా వైరస్ గురించి సంచలన విషయం వెల్లడించారు. కరోనా మానవ నిర్మితమని, వుహాన్ ల్యాబ్ నుంచే ఇది లీక్ అయ్యిందని తెలిపారు. అంటువ్యాధులపై అధ్యయనం సాగించే ఎకో హెల్త్ అలయన్స్ మాజీ ప్రెసిడెంట్ అయిన ఆండ్రూ హఫ్ ‘ది ట్రూత్ అబౌట్ వుహాన్’ పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు న్యూయార్క్ పోస్ట్ కథనం తెలిపింది.

దీని ప్రకారం.. కరోనా వైరస్ లపై పరిశోధనల కోసం చైనాకు నిధులు సమకూర్చడం వల్ల ఈ మహమ్మారి సంభవించిందని వివరించారు. ‘గబ్బిలాల్లోని కరోనా వైరస్ లు ఇతర జాతులపై దాడి చేసే సామర్ధ్యాన్ని అంచనా వేయడానికి ఉన్న అత్యుత్తమ పద్ధతులను డెవలప్ చేయడంలో వుహాన్ ల్యాబుకు అమెరికన్ హెల్త్ అలయన్స్ చాలా ఏళ్లు సాయం చేసింద’ని పుస్తకంలో రాసుకొచ్చారు. ఇది జన్యుపరంగా ఇంజినీరింగ్ చేసిన వైరస్ అని చైనాకు ముందే తెలుసు. ఈ ప్రమాదకరమైన బయోటెక్నాలజీని చైనాకు బదిలీ చేయడానికి అమెరికానే కారణమని అగ్రరాజ్యాన్ని ఎండగట్టారు. ప్రయోగశాలల భద్రత, బయో సెక్యూరిటీ, రిస్క్ మేనేజ్ మెంట్ ని నిర్ధారించడానికి విదేశాల్లో(చైనాలో) తగిన నియంత్రణ చర్యలు లేవు. ఇదే వైరస్ లీక్ కావడానికి కారణమని తేల్చి చెప్పారు. అయితే వైరస్ వెలుగు చూసినప్పుడు అది తమ ల్యాబ్ నుంచి లీక్ కాలేదని వుహాన్ పరిశోధకులు, చైనా ప్రభుత్వం ఖండించాయి. అంతేకాక, చైనా వైరస్ అనే పేరును కోవిడ్ 19 గా మార్చేందుకు విపరీతమైన ఒత్తిడి తెచ్చి అందులో సఫలం అయింది.