కరోనా కల్లోలం.. ఒక్క మహారాష్ట్రలోనే 70 వేల కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా కల్లోలం.. ఒక్క మహారాష్ట్రలోనే 70 వేల కేసులు

June 2, 2020

Corona Latest Information

భారత ప్రజలను కరోనా భయం వెంటాడుతూనే ఉంది. ఓ వైపు లాక్‌డౌన్ నిబంధనలను సడలించడం, మరోవైపు రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. వైరస్ ఇంకా ఏ స్థాయిలో దాడి చేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతానికి మన దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షలకు చేరువలో ఉండటంతో ఇది మరింత ఎక్కువైంది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ గడిచిన 24 గంటల వివరాలను వెల్లడించింది. 

నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా  8,171 మందికి కొత్తగా కరోనా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 198,706 కు పెరిగింది. ఒక్కరోజులోనే  204 మంది కరోనా కాటుకు బలయ్యారు. ఈ సంఖ్య 5,598కు చేరింది. 95,526 వ్యాధి నుంచి కోలుకొని ఇంటికి చేరారు. ఇంకా 198,706 మంది బాధితులు ఆయా రాష్ట్రాల కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగానే ఉంది. మహారాష్ట్రలో నిన్న ఒక్క రోజే 2,361 కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 70,013కు చేరుకుంది.

మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 62,59,887కు చేరింది. ఇప్పటి వరకు 26,92,528 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 3,75,208 ప్రాణాలు కోల్పోయారు. అగ్రరాజ్యం అమెరికాలో ఇంకా పరిస్థితి అలాగే ఉంది. 18,47,626 మంది రోగులు ఉండగా.. నిన్న ఒక్కరోజే 56,064 మందికి కొత్తగా వ్యాధి నిర్ధారణ అయ్యింది. 412,154 మంది డిశ్చార్జ్ అయ్యారు.1,06,570 మంది వైరస్ కాటుకు బలయ్యారు.