పాటలే కాదు సినిమా వచ్చేస్తోంది.. కరోనా మేడ్ ఇన్ చైనా - MicTv.in - Telugu News
mictv telugu

పాటలే కాదు సినిమా వచ్చేస్తోంది.. కరోనా మేడ్ ఇన్ చైనా

May 11, 2020

Corona made in Chinna telugu movie coming

కరోనాపై ఇప్పటికే మన తెలుగులో పాటలు వస్తున్నాయి. మరోవైపు కవులు, కథకులు కవితలు, కథలు కూడా రాసేస్తున్నారు. తాజాగా కరోనాపై టాలీవుడ్‌లో ఓ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘కరోనా మేడిన్ చైనా’ అనే టైటిల్‌తో తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై తల్లాడ శ్రీనివాస్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో సాయికృష్ణ, హనీ, శోభన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శివ కాకు కథ, మాటలు అందించిన ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు చిత్ర యూనిట్.

ఈ సందర్భంగా డైరెక్టర్ సాయికృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమా షూటింగ్‌ను ఫిబ్రవరి నెలలోనే మొదలు పెట్టామని తెలిపారు. దాదాపు 40 శాతం చిత్రీకరణ పూర్తి చేశామని.. తర్వాత కరోనా వైరస్ వ్యాప్తి వల్ల షూటింగ్ నిలిపివేశామని చెప్పారు. ‘ఈ సినిమాలో ట్విస్టులు చాలా ఉంటాయి. మేము కథలో ఏదైతే అనుకున్నామో ప్రస్తుతం బయట అదే జరుగుతోంది. మా సినిమాలో ట్విస్టులతో పాటు నిజాలు కూడా ఉన్నాయి. మనం ఎలా ఉంటామో ప్రకృతి కూడా మనకు అలానే ప్రతిబింబాన్ని చూపిస్తుంది అనే అంశంపై కథ ఉంటుంది’ అని వెల్లడించారు. ఖమ్మం, బాపట్ల ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం విడుదల అనంతరం వచ్చిన డబ్బులో 30 శాతం ఒక అనాథ ఆశ్రమానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు నిర్మాత శ్రీనివాస్ వెల్లడించారు.