1.70 లక్షల కోట్ల కరోనా ప్యాకేజీ.. జన్ ధన్ ఖాతాల్లోకి డబ్బు - MicTv.in - Telugu News
mictv telugu

1.70 లక్షల కోట్ల కరోనా ప్యాకేజీ.. జన్ ధన్ ఖాతాల్లోకి డబ్బు

March 26, 2020

Corona package to poor people 

కరోనాను అరికట్టడానికి విధించిన లాక్‌డౌన్ వల్ల పేదలు, వలస కార్మికులు కష్టాలపాలయ్యారు. చేయడానికి పని దొరక్క ఆకలితో అల్లాడుతున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో కేంద్ర రూ. 1.70 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించింది. ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన’ పథకం కింద దీన్ని మూడు నెలల అమలు చేస్తారు.

పేదలు, కూలి ప్రజల కోసం ఈ ప్యాకేజీ తీసుకొచ్చామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, ఇతర వైద్య, పారిశుధ్య సిబ్బందికి రూ. 15 లక్షల మేర ఆరోగ్యబీమా కల్పిస్తామన్నారు. 

ఈ పథకం కింద.. 

పీఎం కిసాన్ యోజన కింద 2000లను ఏప్రిల్ తొలివారంలో రైతుల ఖాతాల్లో వేస్తామని మంత్రి తెలిపారు. ‘80 కోట్ల మందికి అదనంగా 5 కేజీల బియ్యం, గోధుమలు, ఒక కేజీ పప్పు ధాన్యాన్ని ఉచితంగా అందిస్తాం. గ్రామీణ ఉపాధి హామీ పథకం 5 కోట్ల మందికి వేతనాన్ని రూ. 182 నుంచి రూ. 202కు పెంచుతాం. నిరుపేద వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు  1000 ఇస్తాం. 20 కోట్ల మంది మహిళలకు జన్ ధన్ ఖాతాల్లో మూడు నెలల పాటు రూ. 500 చొప్పున డబ్బులు వేస్తాం.. ఉజ్వల యోజన పథకం లబ్దిదారులకు మూడు నెలల పాటు ఉచిత గ్యాస్ అందిస్తాం’ అని ఆమె తెలిపారు. కాగా, ప్రతి ఒక్కరికీ మూడు నెలల పాటు 7 కేజీల సబ్సిడీ ధాన్యాన్ని ఇవ్వాలని, గోధుమలు రూ.2కు, బియ్యం రూ.3కు అందజేయాలని కేబినెట్ బుధవారం నిర్ణయించింది.