కరోనాను ప్రభుత్వాలు తేలిగ్గా తీసుకుని జనాన్ని రోడ్లపైకి రప్పిస్తున్నాయి. కరోనాతో సహజీవనం చేయాల్సిందేనంటూ ఆదాయ మార్గాలను వెతుకుతున్నాయి. అదే సమయంలో వైద్యసదుపాయాలను కూడా గాలికొదిలేశాయి. క్వారంటైన్ టైమ్ తగ్గించడమే కాకుండా, ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరమే లేదని, మెడిసిన్స్ వాడితే సరిపోతుందని అంటున్నాయి. అయితే అనుభవించేవాడికే బాధేమిటో తెలిసినట్లు కరోనా పేషంట్లు మాత్రం ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని రోజులు వెళ్లదీస్తున్నారు. గుండె ధైర్యం లేని వాళ్లు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మహారాష్ట్రలో ఓ కరోనా పేషంట్ ఒళ్లు గగుర్పొడిచే రీతిలో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సాంగ్లీ జిల్లా మిరాజ్ ప్రాంతంలోని ఆస్పత్రిలో ఆదివారం ఈ దారుణం జరిగింది. 56 ఏళ్ల పేషంట్ ఆస్పత్రి బెడ్‌పైనే కత్తితో గొంతు కోసుకుని చనిపోయాడు. ఆ సమయంలో వైద్య సిబ్బంది అజాపజా లేకుండా పోయారు. ఘోరం సీసీ కెమెరాల్లో రికార్డయింది. విషయం తెలుసుకున్న సిబ్బంది అతణ్ని వెంటనే ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లి కాపాడేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. చనిపోయే ముందు అతడు తన కొడుక్కి ఫోన్ చేసి, ఇకపై కుటుంబాన్ని నువ్వే పోషించాలని చెప్పినట్లు తెలుస్తోంది. సంఘటన ప్రాంతంలో సూసైట్ నోట్ కనిపించలేదని, మానసిక ఒత్తికి గురయ్యే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు చెబుతున్నారు.