చెట్టుకిందే ఐసోలేషన్.. ఏపీలో కరోనా రోగుల అవస్థలు  - MicTv.in - Telugu News
mictv telugu

చెట్టుకిందే ఐసోలేషన్.. ఏపీలో కరోనా రోగుల అవస్థలు 

August 11, 2020

Corona Patients Shelter in Tree

కరోనా రోగులకు అరగంటలోనే బెడ్ సౌకర్యం కల్పించాలని ఏపీ సీఎం జగన్ చెబుతున్నా అధికారులు మాత్రం చలించడం లేదు. ఏ మాత్రం పట్టింపు లేకుండా కరోనా రోగులను అలాగే వదిలేస్తున్నారు. విజయనగరం జిల్లా సాలూర్ మండలం ఖరసవాలాస గ్రామంలో అయితే కరోనా రోగులు అంతా ఓ చెట్టు కిందే ఆశ్రయం ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 15 మంది వరకు అక్కడే ఉంటున్నారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోగులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని విమర్శిస్తున్నారు.

మూడు రోజుల క్రితం గ్రామంలో కరోనా పరీక్షలు చేయగా 15 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్చింది. వారిని అంగన్వాడి కేంద్రం సమీపంలోని చెట్టు కింద ఐసోలేషన్ చేశారు. అక్కడ సరైన సదుపాయాలు ఏర్పాటు చేయడంలో అధికారులు అలసత్వం ప్రదర్శించారు. వీరిలో మహిళలు, పిల్లలు, వృద్ధులు కూడా ఉండటంతో ఓ యువకుడు అక్కడి పరిస్థితిపై ఉన్నతాధికారులకు చేరేలా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మంచి ఆహారంతో పాటు పడుకోవడానికి సదుపాయం కల్పించాలని కోరాడు. ఇది వైరల్ కావడంతో స్థానిక  తహసీల్దార్‌ షేక్‌ ఇబ్రహీం స్పందించారు. వారికి ఓ పాఠశాలలో ఆశ్రయం కల్పించే ఏర్పాటు చేశారు. అయితే తమను మూడు రోజులుగా చెట్టుకిందే వదిలేశారని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు.