2000 మార్క్ దాటేసిన ఏపీ.. కోయంబేడులో కొని తెచ్చుకుంది! - MicTv.in - Telugu News
mictv telugu

2000 మార్క్ దాటేసిన ఏపీ.. కోయంబేడులో కొని తెచ్చుకుంది!

May 11, 2020

Corona Positive Cases in Andhra Pradesh

ఏపీలో కరోనా సృష్టిస్తున్న కల్లోలం ఏ మాత్రం ఆగడం లేదు. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతూనే ఉంది. దీంతో పాజిటివ్ కేసులు 2 వేల మార్క్ దాటేసింది. తాజాగా రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించిన లెక్కల ప్రకారం 2018 మంది బాధితులు ఉన్నారు. 998 మంది కోలుకొని డిశ్చార్జ్ కావడంతో ఇంకా 975 మంది వివిధ కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లోనే 38 మందికి కొత్తగా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా 45 మంది రోగులు కరోనా కాటుకు బలయ్యారు. 

ప్రతి రోజూ అధికారులు కరోనా శాంపిల్స్ పరీక్షలను పెంచుతూనే ఉన్నారు. నిన్న 7,409 మందికి పరీక్షలు జరిపారు. ఈ సంఖ్య ఇంకా పెంచాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఎక్కువ మందిని పరీక్షిస్తూ వైరస్‌ను కట్టడి చేయాలని నిర్ణయించారు. పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో పాటు డిశ్చార్జ్ అయ్యే వారి సంఖ్య కూడా అలాగే ఉందని అధికారులు చెబుతున్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో చిత్తూరు, కర్నూలులోనే అత్యధికంగా ఉన్నాయి. వీరిలో చాలా మంది తమిళనాడు నుంచి వచ్చిన వారు కావడం విశేషం. వరుసగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు కూడా వైరస్ దాటికి భయపడిపోతున్నారు.