జగన్ పేషీ అధికారికి కరోనా.. సచివాలయంలో 10 మందికి - MicTv.in - Telugu News
mictv telugu

జగన్ పేషీ అధికారికి కరోనా.. సచివాలయంలో 10 మందికి

June 6, 2020

CM Jagan.

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా గుబులు రేపుతోంది. ముఖ్యమంత్రి జగన్ పేషీలో పనిచేసే అధికారికి చెందిన డ్రైవర్ సహా ఐదుగురు ఉద్యోగులకు కరోనా సోకింది. పరీక్షలు చేయగా వారికి పాజిటివ్‌గా తేలింది. ఔట్‌సోర్సింగ్ ద్వారా కమాండ్ కంట్రోల్‌లో పనిచేసే ఓ ఉద్యోగికి, పరిశ్రమల శాఖలో పనిచేసే మరో ఉద్యోగి, సీఎం బ్లాక్‌లో ఆర్‌టీజీఎ‌స్‌లో పనిచేసే సర్వీస్ ప్రొవైడర్‌కు, ప్రణాళిక విభాగం‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి, ముఖ్యమంత్రి పేషీలో పనిచేసే అధికారి డ్రైవర్‌కు, ఉన్నత విద్యాశాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు కరోనా నిర్ధారణ అయినట్లు సమాచారం. ఇప్పటి వరకు మొత్తంగా ఏపీ సచివాలయంలో 10 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సచివాలయాన్ని శానిటైజ్ చేస్తుండగా.. సీఎం పేషీలో పలువురికి కరోనా సోకడం కలకలం రేపుతోంది.


హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఏపీ సచివాలయ ఉద్యోగుల్లో పలువురికి కరోనా వైరస్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన ఉద్యోగుల సంఘం.. సచివాలయంలోని 3, 4 బ్లాకుల్లో పనిచేసే ఉద్యోగులు కార్యాలయాలకు రావొద్దని ఉద్యోగుల సూచనలు చేసింది. 3, 4 బ్లాకుల్లో పనిచేసే ఇద్దరికి కరోనా సోకడంతో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. కాగా, ఆరోగ్యసేతు యాప్‌ ఉన్న ఉద్యోగులకు మాత్రమే కార్యాలయంలోకి అనుమతిని ఇస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నిన్న (శుక్రవారం) ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. విధుల్లోకి వచ్చే ఉద్యోగులకు థర్మల్‌ స్క్రీనింగ్‌, మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలని ఆమె ఆదేశించారు. హై రిస్క్‌ జోన్లలో ఉన్న ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పించాలని వెల్లడించారు. ఇంతలోనే సచివాయంలో మరిన్ని కరోనా కేసులు నమోదయ్యాయి.