11 మంది పోలీసులకు కరోనా.. ఏకంగా పోలీస్ స్టేషనే బంద్ - MicTv.in - Telugu News
mictv telugu

11 మంది పోలీసులకు కరోనా.. ఏకంగా పోలీస్ స్టేషనే బంద్

July 5, 2020

 jfmh n

దేశంలో కరోనా వికృతాలు కోకొల్లలు. రోజురోజుకు కరోనా విస్తరిస్తూ ప్రజలను, ప్రభుత్వాలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా నెల్లూరు జిల్లాలో కరోనా వైరస్ కారణంగా ఏకంగా పోలీస్ స్టేషన్నే మూసివేశారు. జిల్లాలోని వెంకటగిరి పోలీస్ స్టేషన్‌లో పనిచేసే దాదాపు అందరికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సీఐ, ఎస్సై సహా మొత్తం 11 మంది పోలీసులు, సిబ్బందికి కరోనా సోకింది. దీంతో పోలీస్ స్టేషనే మూతపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవలే ఓ హత్య కేసులో పలువురు నిందితులను పోలీసులు అరెస్టు చేయగా.. వారి ద్వారానే పోలీసులకు కరోనా వ్యాపించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వెంకటగిరి సీఐతో పాటు, ఎస్సై, ఏడుగురు పోలీసులకు, హోంగార్డుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. స్వీపర్లకు సైతం వైరస్ సోకింది. దీంతో పోలీస్ స్టేషన్‌ను మూసివేసి అందరినీ క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు.

కాగా, గడిచిన 24 గంటల్లో ఏపీలో 20,567 శాంపిల్స్‌ని పరీక్షించగా.. కొత్తగా 998 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌ విడుదల చేసింది. వీటిలో రాష్ట్రానికి చెందిన వారు 961 మంది ఉండగా, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 36 మంది ఉన్నారు. ఇక విదేశాల నుంచి వచ్చినవారిలో ఒకరు ఉన్నారు. ఇక జిల్లాలవారిగా నమోదైన కేసులను తీసుకుంటే.. అనంతపురంలో 87, చిత్తూరులో 74, ఈస్ట్‌ గోదావరిలో 118, గుంటూరులో 157, కడపలో 52, కృష్ణలో 62, కర్నూలులో 97, నెల్లూరులో 45, ప్రకాశంలో 27, విశాఖపట్నంలో 88, విజయనగరంలో 18, పశ్చిమ గోదావరిలో 40 చొప్పున కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 18,697కి పెరిగింది.ఈ రోజు కరోనాతో 14 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మృతుల సంఖ్య 232కి చేరింది.