ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. ఎన్ని చర్యలు చేపట్టినా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పేషీలోనే కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపింది. ఓ అటెండర్‌కు వ్యాధి సోకినట్టుగా అధికారులు వెల్లడించారు. దీంతో అతన్ని పిన్నమనేని సిద్ధార వైద్య కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్న అతనికి వైద్య సిబ్బంది ట్రూనాట్ పరీక్షల్లో ప్రిజంప్టివ్ పాజిటివ్ అని వచ్చింది. దీంతో తుది నిర్ధారణకు నమూనాను వైరాలజీ ల్యాబ్‌కి పంపారు. ఆయన ఇటీవల ఎవరిని కలిశారు. వ్యాధి ఎలా సోకిందనే కోణంలో విచారణ ప్రారంభించారు. అతనికి సన్నిహితంగగా ఉన్నవారిని గుర్తించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు మంత్రి భద్రత సిబ్బంది, పేషీలోని మిగతా అధికారులు, ఉద్యోగులకు పరీక్షలు చేశారు. మొత్తం 12 మందికి పరీక్షలు చేయగా.. వారందరికీ నెగెటివ్ వచ్చిందని వైరాలజీ ల్యాబ్ ప్రొఫెసర్ రత్నకుమారి తెలిపారు.