ఏపీలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా

August 4, 2020

Corona Positive to Two Andhra Pradesh MLA's

ఏపీని కరోనా హడలెత్తిస్తోంది. సామాన్యులే కాదు వరుసగా ప్రజా ప్రతినిధులు కూడా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు వైరస్ సోకి కోలుకోగా.. ఇంకా కొంత మంది చికిత్స పొందుతున్నారు. నిన్న అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి కరోనా పాజిటివ్ అని తేలగా.. తాజాగా మంగళవారం మరో ఇద్దరు ఎమ్మెల్యేలు  వైరస్ బారినపడ్డారు. 

చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు కరోనా సోకింది. వెంటనే ఆయన బంజారాహిల్స్ స్టార్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఆయన కుటుంబ సబ్యులతో పాటు సన్నిహితంగా ఉన్నవారికి కూడా టెస్టులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. టీడీపీ తరుపున గెలిచిన కరణం బలరాం కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. 

ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు కూడా ఆస్పత్రిలో చేశారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో ఒంగోలులోని రమేష్ సంఘమిత్ర వైద్యశాలలో పరీక్షలు చేయించుకున్నారు. అతడితో పాటు ఆయన భార్యకు కూడా పాజిటివ్ అని వచ్చింది. వీరిద్దరూ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా ఇటీవలే ఆయన పుట్టిన రోజు సందర్భంగా పలువురు నేతలు, కార్యకర్తలు అతన్ని కలిశారు. వీరిలో ఓ మంత్రి కూడ ఉన్నట్టుగా సమాచారం. దీంతో వారంతా టెన్షన్ పడుతున్నారు. అతనితో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు.  కాగా నెల రోజుల క్రితం అన్నా మనవడికి పాజిటివ్ రాగా.. చికిత్స తీసుకొని కోలుకున్నాడు.