కరోనా పేషంట్‌కు మేలతాళాలతో ఘన స్వాగతం     - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా పేషంట్‌కు మేలతాళాలతో ఘన స్వాగతం    

March 31, 2020

Corona Recovered Patient Receives Grand Welcome  

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. వ్యాధి ఏదైనా ప్రాంతంలో వ్యక్తికి కరోనా పాజిటీవ్ వచ్చిందంటే చాలు అటుగా వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. ఇదిలా ఉంటే ఈ వ్యాధి బారినపడి కోలుకొని ఇంటికి వచ్చిన వారు  సమాజం నుంచి ఎటువంటి చీత్కారాలు వస్తాయో తెలిక మానసికంగా ఆందోళన చెందుతున్నారు. కానీ ఈ వైరస్‌ను జయించి క్షేమంగా ఇంటికి చేరుకున్న ఓ 34 ఏళ్ల మహిళకు ఊహించని స్వాగతం లభించింది. ఇరుగు పొరుగువారు ఆమెకు ఘన స్వాగతం పలకడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. 

గుజరాత్‌కు చెందిన మహిళ ఇటీవల  ఫిన్‌ల్యాండ్‌లోని నార్తర్న్‌లైట్స్‌కి విహారయాత్రకు  వెళ్లి వచ్చింది. వచ్చి రాగానే ఆమెకు కరోనా లక్షణాలు బయటపడటంతో ఐసోలేషన్‌ కోసం తరలించారు. దాదాపు 20 రోజులు చికిత్స పొందిన ఆ మహిళ మహమ్మారిని జయించి ప్రాణాలతో బయటపడింది. కానీ ఆస్పత్రి నుంచి ఇంటికి రావడానికి మాత్రం వెనకాడింది. తనను చుట్టు పక్కన వారు ఎలా చూస్తారో అని మదనపడింది. అదే బెంగతో కారు దిగి భయం భయంగా ఇంటికి వచ్చిన ఆమెకు ఊహించని స్వాగతం లభించింది. తోటి కాలనీ వారంతా చప్పట్లు కొడుతూ, మేళతాళాలు వాయిస్తూ ఆహ్వానించారు. అంతా పద్దతిగా వరుసగా నిలబడి ఆమెకు అండగా నిలిచారు. 

సమాజం నుంచి చీత్కారాలు ఎదర్కోవాల్సి వస్తుందేమోని భయపడిన ఆమెకు కాలనీ వారు మనో ధైర్యాన్ని నింపారు. వారు చాటిన మానవత్వంపై ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి. దీనిపై బాధితురాలు కూడా మాట్లాడింది. తాను ఇంటికి రాగానే నన్ను చూసి అందరూ దూరంగా వెళతారని భావించాననీ, కానీ వారు స్వాగతించిన తీరు ఎన్నడూ మర్చిపోలేనని పేర్కొంది. వైద్యులు ఇచ్చిన మనోధైర్యం కారణంగా ఈ వ్యాధి నుంచి బయటపడ్డానని తెలిపింది.