హైదరాబాద్‌లోనూ కరోనా స్టాంపులు.. - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లోనూ కరోనా స్టాంపులు..

March 21, 2020

Hyderabad.

కరోనా వ్యాప్తిని ఆపేందుకు హైదరాబాద్‌లోనూ ప్రభుత్వ సిబ్బంది కరోనా స్టాంపులు వేస్తున్నారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చేవారిని హోం క్వారంటైన్ చేస్తూ ముద్రలు వేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓటు వేశాక పోలింగ్ కేంద్రంలో చేతి వేలిపై సిరా చుక్క వేసేందుకు ఉపయోగించే ఇంకుతోనే ఈ స్టాంప్‌ను చేతి మడమపై కనిపించే విధంగా వేస్తున్నారు. అలా స్టాంపులు వేసినవారు తప్పనిసరిగా విదేశాల నుంచి వచ్చిన తేదీ నుంచి 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. అన్ని రోజులను లెక్కించి స్టాంపులో తేదీని సరిచేసి వేస్తున్నారు. 

హైదరాబాద్ పరిధిలోనే 13 వేల మంది వరకు విదేశాల నుంచి వచ్చారని తెలుస్తోంది.  వారి పాస్‌పోర్ట్‌ ద్వారా అడ్రస్‌ కనుక్కుని ఇళ్లకు వెళ్లి ముద్రలు వేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో సైతం ముద్రలు వేస్తున్నారు. కరోనా లక్షణాలు ఉంటే పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్నారు. కాగా, కరోనా వ్యాప్తిని నివారించడానికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్లలో రిటైర్ అయిన డాక్టర్లను, నర్సులను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు ప్రభుత్వం ఆదేశించింది. మొదట మూడు నెలలు కాంట్రాక్ట్ పద్ధతిన డాక్టర్లను, నర్సులను తీసుకోనున్నట్టు వెల్లడించింది. రాష్ట్రంలో ఒకవేళ కరోనా కేసులు ఎక్కువ అయితే.. డాక్టర్లు, నర్సుల కొరత ఉండొద్దని ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది.