ఖైదీ నంబర్ కోవిడ్ 19.. దగ్గాడు, తుమ్మాడు, పారిపోయాడు..
కరోనా వైరస్ ఒక పక్క ప్రజల ప్రాణాలను తోడేస్తేంటే.. మరోపక్క దాని సాకుతో కొందరు కాగల కార్యం కరోనా తీర్చిందని పనులు చక్కబెట్టుకుంటున్నారు. పోలీసు కస్టడీలో ఉన్న ఖైదీ. దగ్గి, తుమ్మి, పారిపోయాడు. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఈ తతంగం చోటుచేసుకుంది.
మాయాండీ అనే దోపిడీ దొంగను మంగళవారం అరెస్ట్ చేసిన పోలీసులు తిరునల్వేలి జిల్లా పాళయం కోట్టైలోని సెంట్రల్ జైలుకు తీసుకెళ్తున్నారు. నిందితుణ్ని వ్యాన్ ఎక్కించి అతని పక్కనే కూర్చున్నారు. దారి మధ్యలో మాయాండి.. ‘హాచ్చ్.. హాచ్చ్‘ అన పెద్దపెట్టున తుమ్మాడు. తర్వత దగ్గులకు లంకించుకున్నాడు. తనకు కరోనా సోకిందేమోనని, మీరు దూరంగా ఉండాలని పోలీసులకు చెప్పాడు. ఠారెత్తిన పోలీసులు అతణ్ని పాళం కోట్టై దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు అతణ్ని పరీక్షల కోసం లోపలికి తీసుకెళ్లారు. కరోనా సోకుతుందన్న భయంతో పోలీసులు కాస్త దూరంగా తచ్చాడారు. ఇదే అదనుగా భావించిన మాయండీ కన్నుగప్పి కాలికి బుద్ధి చెప్పాడు. చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడ పట్టినా ఫలితం లేకపోయింది. ‘కరోనా ఖైదీ’ కావడంతో పోలీసులు టెన్షన్ తో అతని కోసం భారీ స్థాయిలో వేట ప్రారంభించారు. రోడ్లపై తిరిగితే పోలీసులు పట్టుకుంటారని భావించిన మాయాండి వేదనాకులం నదిలో ఈదుకుంటూ పారిపోయినట్లు అనుమానించిన పోలీసులు అతని ఫోటోతో విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు.