అశ్విన్‌కు కరోనా.. చివరి టెస్టుకు ఆలస్యం: బీసీసీఐ - MicTv.in - Telugu News
mictv telugu

అశ్విన్‌కు కరోనా.. చివరి టెస్టుకు ఆలస్యం: బీసీసీఐ

June 21, 2022

టీమ్ ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కరోనా బారినపడ్డారు. దాంతో ఆయన క్వారంటైన్‌లోకి వెళ్లిపోయాడు. ఇంగ్లాండ్‌తో జరగబోయే చివరి టెస్టు మ్యాచ్‌కు అశ్విన్ ఆలస్యంగా బయలుదేరనున్నట్లు బీసీసీఐ అధికారి తెలిపారు. ఇప్పటికే రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లండ్ చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టింది.

తాజాగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ పూర్తైన విషయం తెలిసిందే. కోచ్ రాహుల్ ద్రవిడ్‌తోపాటు శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ సోమవారం బయలుదేరి ఇంగ్లాడుకు వెళ్లారు. అయితే, అశ్విన్ గతనెల భారత టీ20 లీగ్‌లో రాజస్తాన్ తరఫున ఆడాక బయోబబుల్ వీడి తమిళనాడు క్రికెట్ ఆసోసియేషన్ డివిజన్ 1 లీగ్ క్రికెట్ ఆడాడు. ఆ సమయంలోనే అతడికి కరోనా సోకడంతో, క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు బీసీసీఐ అధికారి పీటీఐకి చెప్పారు. అందువల్లే సీనియర్ ఆఫ్ స్పిన్నర్ టీమ్ ఇండియాతో కలిసి ఇంగ్లాండ్‌కు వెళ్లలేదని, కొవిడ్ నుంచి కోలుకున్నాక ప్రొటోకాల్ ప్రకారం అక్కడికి బయలుదేరతాడని వెల్లడించారు.

అయితే, శుక్రవారం నుంచి లీకెస్టెర్‌షైర్‌తో ప్రారంభమయ్యే నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌కు అశ్విన్ అందుబాటులో ఉండడని, జులై 1 నుంచి బర్మింగ్ హామ్‌లో ప్రారంభమయ్యే టెస్టు మ్యాచ్ కల్లా అతడు జట్టుతో కలుస్తాడని స్పష్టం చేశారు.