మార్చి 16 నుంచి పిల్లలకు కరోనా టీకా: కేంద్రం - MicTv.in - Telugu News
mictv telugu

మార్చి 16 నుంచి పిల్లలకు కరోనా టీకా: కేంద్రం

March 14, 2022

bgn

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16 నుంచి 12-14 ఏళ్ల పిల్లలకు టీకా పంపిణీని ప్రారంభిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా 60 ఏళ్లు పైబడిన అందరికీ ప్రికాషనరీ డోసు పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. 12-14 ఏళ్ల వారికి టీకా పంపిణీని ప్రారంభించేందుకు నేషనల్ టెక్నికల్ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ ఇప్పటికే కేంద్రానికి సిఫార్సులు చేసింది. దీంతో కేంద్రం బుధవారం నుంచి 12-14 ఏళ్ల వారికి టీకా పంపిణీని ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. బయోలాజికల్ ఇ సంస్థ అభివృద్ధి చేసిన కార్బెవాక్స్ టీకాను ఇవ్వనున్నట్లు తెలిపింది.

మరోపక్క 3-1- 2022 నుంచి 15-18 ఏళ్ల వారికి టీకా పంపిణీని కేంద్రం ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఇప్పటిదాకా దాదాపు ఆ వయసున్న వారికి వ్యాక్సినేషన్ పూర్తయిందని తెలిపింది. ఈ నేపథ్యంలో 12-14 ఏళ్ల వారిపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇక, ప్రికాషన్ డోసులో ‘ఇతర అనారోగ్య సమస్యల క్లాజ్‌ను తొలగించాలని కూడా కేంద్రం నిర్ణయించింది. మార్చి 16వ తేదీ నుంచి 60ఏళ్లు పైబడిన అందరికీ ప్రికాషనరీ డోసు ఇవ్వనున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జనవరి 10 నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లతో పాటు 60ఏళ్లు పైబడిన ఇతర అనారోగ్య సమస్యలున్న వృద్ధులకు కేంద్రం ప్రికాషనరీ డోసును పంపిణీ చేస్తోన్న విషయం తెలిసిందే.