ఏపీలో ఒకేరోజు 14 మందిని బలి తీసుకున్న కరోనా - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో ఒకేరోజు 14 మందిని బలి తీసుకున్న కరోనా

July 5, 2020

998 Positive.

ఏపీలో కరోనా కేసులు నానాటికీ పెరుగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతిరోజూ వందల్లో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 20,567 శాంపిల్స్‌ని పరీక్షించగా.. కొత్తగా 998 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌ విడుదల చేసింది. వీటిలో రాష్ట్రానికి చెందిన వారు 961 మంది ఉండగా, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 36 మంది ఉన్నారు. ఇక విదేశాల నుంచి వచ్చినవారిలో ఒకరు ఉన్నారు. ఇక జిల్లాలవారిగా నమోదైన కేసులను తీసుకుంటే.. అనంతపురంలో 87, చిత్తూరులో 74, ఈస్ట్‌ గోదావరిలో 118, గుంటూరులో 157, కడపలో 52, కృష్ణలో 62, కర్నూలులో 97, నెల్లూరులో 45, ప్రకాశంలో 27, విశాఖపట్నంలో 88, విజయనగరంలో 18, పశ్చిమ గోదావరిలో 40 చొప్పున కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 18,697కి పెరిగింది.

ఈ రోజు కరోనాతో కర్నూలులో ఐదుగురు, అనంతపూర్‌లో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, కడపలో ఇద్దరు, కృష్ణలో ఒక్కరు, విశాఖపట్నంలో ఒక్కరు.. మొత్తం 14 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మృతుల సంఖ్య 232కి చేరింది. మొత్తం నమోదైన కేసుల్లో ఇప్పటి వరకు 8,422 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 10,043 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.