పసికందును వదలని కరోనా.. మహబూబ్ నగర్‌లో కలకలం - MicTv.in - Telugu News
mictv telugu

పసికందును వదలని కరోనా.. మహబూబ్ నగర్‌లో కలకలం

April 7, 2020

Corona will not leave baby.. Mahaboobnagar Incident

అమెరికాలో కరోనా సోకి ఓ శిశువు మరణించగా.. తెలంగాణలో కొన్ని రోజుల శిశువుకు కరోనా సోకడం కలకలం రేపుతోంది. మహబూబ్ నగర్ జిల్లాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కరోనా సోకిన ఆ పసికందు వయసు కేవలం 23 రోజులే. ఆ శిశువు తండ్రి, నాయనమ్మకు కూడా కరోనా సోకింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ వెంకట్ రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఢిల్లీలోని ఇటీవల మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారి ద్వారానే ఈ ముగ్గురికి కరోనా వైరస్ వ్యాపించిందని అధికారులు భావిస్తున్నారు. వెంటనే వారిని కరోనా చికిత్స కోసం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. 

ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ముగ్గురి ద్వారా వైరస్ ఎవరెవరికి సోకే అవకాశాలు ఉన్నాయో గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. ‘మహబూబ్‌నగర్‌లో ఇవాళ కొత్తగా మూడు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మర్కజ్ వెళ్లొచ్చిన వారి ద్వారా ముగ్గురికి కరోనా సోకింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్నీ చర్యలు తీసుకుంటున్నాం’ అని కలెక్టర్ వెంకట్ రావు పేర్కొన్నారు.  కాగా, కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. మరో రెండు వారాలు లాక్‌డౌన్‌‌ను పొడిగించే యోచనలో ఉన్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించిన విషయం తెలిసిందే.