భారత్‌లో కోరలు చాస్తోన్న కరోనా..13,313 కేసులు నమోదు - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌లో కోరలు చాస్తోన్న కరోనా..13,313 కేసులు నమోదు

June 23, 2022

భారతదేశంలో కరోనా మహమ్మారి మళ్లీ వేగంగా వ్యాపిస్తుంది. కొన్ని నెలలక్రితం తగ్గినట్లే తగ్గి, తాజాగా రోజుకు 10 వేలపైనే కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. నిన్న, మొన్నటి వరకూ పదకొండు, పన్నెండు వేలుగా నమోదైన కేసులు బుధవారం ఒక్కరోజే 13,313 కేసులు నమోదు అయ్యాయి. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసులను బట్టి చూస్తే ఫోర్త్ వేవ్ తప్పదు అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజా కరోనా కేసులకు సంబంధించి గురువారం కేంద్ర వైద్యాఆరోగ్యశాఖ అధికారులు బులెటెన్ విడుదల చేశారు.

విడుదలైన బులెటెన్ వివరాల ప్రకారం..”గడిచిన 24 గంటల్లో 13,313 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 10,972 మంది కరోనా నుంచి కోలుకోగా, 38 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 83,990 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,33,44,958కి చేరింది. వీరిలో 4,27,36,027 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,941 మంది మృతి చెందారు. దేశంలో రికవరీ రేటు 98.60 శాతంగా, పాజిటివిటీ రేటు 2.03 శాతంగా, మరణాల రేటు 1.21 శాతంగా, క్రియాశీల రేటు 0.19 శాతంగా ఉంది” అని వెల్లడించారు.

మరోపక్క దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,96,62,11,973 మంది కరోనా వ్యాక్సిన్ వేసుకున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం ఒక్కరోజే 14,91,941 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారని, ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కడికి వెళ్లిన మాస్కు, శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ పాటించాలని కోరారు.