కరోనా అసలు కథ ఇప్పుడే షురూ.. జూన్, జూలైలో ఎక్కువే.. ఈటల - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా అసలు కథ ఇప్పుడే షురూ.. జూన్, జూలైలో ఎక్కువే.. ఈటల

May 29, 2020

 

Etela Rajender.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా అసలు కథ ఇప్పుడే మొదలైందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ పట్టణంలో సమగ్ర వ్యవసాయం – సుస్థిర వ్యవసాయం కార్యక్రమానికి హాజరైన మంత్రి ఈటల తెలంగాణాలో కరోనా గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తున్నందున వారికి ఎక్కువ శాతం కరోనా ఉండటంతో పల్లెలు, పట్టణాలు క్షేమంగా ఉండే పరిస్థితి లేదని ‌తెలిపారు. కరోనా ఇప్పుడే పోయేది కాదని ఆయన స్పష్టంచేశారు. 

మొదటి రెండు నెలలు లాక్‌డౌన్ విషయంలో సీరియస్‌గా వ్యవహరించాం కాబట్టే కేసులు తక్కువ స్థాయిలో నమోదయ్యాయని అన్నారు. ‘ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కరోనాను అస్సలు లైట్‌గా తీసుకోవద్దు. జూన్, జూలై నెలలో ఎక్కువగా కరోనా విస్తరించే అవకాశం ఉంది. కరోనాను అపగలిగే శక్తి ప్రభుత్వాలకు లేదు. ప్రజలు దీన్ని తేలికగా తీసుకోకుండా.. ఎవరికివారే జాగ్రత్తగా ఉండాలి’ అని ఈటల హితవు పలికారు.  రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానానికి రైతులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని.. ఈ సంవత్సరం 71 వేల ఎకరాల్లో పంట పండించిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. దేశంలో అందరికీ అన్నం పెట్టే రైతులు తెలంగాణ రైతులు అని రాబోయే రోజుల్లో తెలంగాణ రైతులు ధనవంతులు కాబోతున్నారని ఆశాభావం వ్యక్తంచేశారు.