సీఆర్పీఎఫ్ బలగాల్లో తొలి కరోనా మరణం
కరోనా మహమ్మారి కాటు వేయని వారు లేరు. ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతూ వ్యాపిస్తూ వెళుతోంది. తాజాగా కేంద్ర బలగాల్లో తొలి కరోనా మరణం సంభవించింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)కి చెందిన 55 ఏళ్ల ఓ అధికారి.. మంగళవారం మృతిచెందారని అధికారులు వెల్లడించారు. ఏఎస్ఐ ర్యాంకు అధికారి హోదాలో ఉన్న ఆయనకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది.
దీంతో ఆయనను సఫ్దర్‌గంజ్ ఆసుపత్రికి తరలించారని.. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మరణించారని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎంతో పటిష్టంగా ఉన్న సీఆర్‌పీఎఫ్ దళాల్లో తొలిమరణం సంభవించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనతో CRPF బలగాలు మరింత అప్రమత్తం అయ్యాయి. ఇదిలావుండగా మంగళవారం తాజాగా ఢిల్లీలో 12 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్ తేలింది. దీంతో వారందరినీ పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 47 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాగా, CRPF దేశం యొక్క అతిపెద్ద పారామిలిటరీ శక్తి. సుమారు 3.25 లక్షల మంది సిబ్బంది అందులో ఉన్నారు. ఈ బలగాలు ముఖ్యంగా కాశ్మీర్ లోయలో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలు, తీవ్రవాద నిరోధక విధులకు ప్రధాన కేంద్రంగా పనిచేయడమే కాకుండా ప్రధాన అంతర్గత భద్రతా దళంగా గుర్తించబడింది.