కరోనాతో వెయ్యి దాటిన మృతులు.. మాస్క్‌తో చైనా అధ్యక్షుడు - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాతో వెయ్యి దాటిన మృతులు.. మాస్క్‌తో చైనా అధ్యక్షుడు

February 11, 2020

కరోనా వైరస్‌తో చైనాలో రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆ వైరస్ తమను ఎక్కడ ఆవహిస్తోందని అక్కడి జనాలు ఇళ్లనుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. భయం గుప్పిటలో నిమిషాలు లెక్కబెడుతున్నారు. అయితే దీని బారిన పడి చైనాలో ఈరోజుతో వెయ్యి మంది మృత్యువాత పడ్డారు. అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారం చైనా దేశ వ్యాప్తంగా 1,011 మంది ప్రాణాలు కోల్పోయారు. అనధికారికంగా ఈ సంఖ్య భారీగానే ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హూబీ ప్రావిన్స్‌లో మరో 2,097 మంది ఈ వైరస్ బారిన పడ్డారని.. వారిలో 103 మంది మరణించారని అక్కడి హెల్త్ కమిషన్ తెలిపింది. దేశ వ్యాప్తంగా 42,200 మందికి పైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారని లెక్కలు చెబుతున్నాయి. 

ఈ నేపథ్యంలో అంతర్జాతీయ వైద్య నిపుణులతో కూడిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కు చెందిన బృందం నిన్న రాత్రి చైనాకు చేరుకున్నారు. ఈ బృందానికి బ్రూస్ ఐల్వార్డ్ నాయకత్వం వహిస్తున్నారు. 2014-16 మధ్య కాలంలో పశ్చిమ ఆఫ్రికాను ఎబోలా వైరస్ వణికించినప్పుడు కూడా డబ్ల్యూహోఓ తరపున కార్యకలాపాలను ఆయనే పర్యవేక్షించారు. కాగా, బీజింగ్‌లో కరోనా సోకినవారు చికిత్స పొందుతున్న ఆసుపత్రిని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సందర్శించారు. వైద్యులను, రోగులను ఆయన కలుసుకున్నారు.  కరోనాను అరికట్టడానికి మరిన్ని మెరుగైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు చైనా అధికారిక వార్తా సంస్థ సీసీటీవీ వెల్లడించింది.