తెలంగాణలో కరోనా గుబులు.. నేడు 1,850 కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో కరోనా గుబులు.. నేడు 1,850 కేసులు

July 4, 2020

1,850 Positive.

తెలంగాణలో కరోనా విలయతాండవానికి నడుం కట్టుకున్నట్టుగానే ఉంది. వాతావరణం చల్లబడటం, లాక్‌డౌన్ సడలించడమే అదనుగా భావించిన కరోనా వీరలెవల్లో రెచ్చిపోతోంది. నిన్న రికార్డు స్థాయిలో రాష్ట్రంలో పాజిటివ్ కేసులు నమోదవగా.. ఈ రోజు కూడా ఆ రికార్డును కొనసాగించింది. వెయ్యి అయిపోయింది.. ఇక రెండు వేల మార్కును దాటాలి కదా, అదే ఆశతో కరోనా దూసుకుపోతోంది. తాజాగా నేడు తెలంగాణలో 1,850 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే 1,572 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాలవారిగా తీసుకుంటే.. రంగారెడ్డిలో 92, మేడ్చల్ 53, వరంగల్ అర్బన్ 31, కరీంనగర్ 18, నిజామాబాద్ 17, 

నల్గొండ 10, సంగారెడ్డి 8, ఖమ్మం 7, వరంగల్ రూరల్ 6, మహబూబ్ నగర్ 5, జగిత్యాల 5, సిద్దిపేట్ 5, జయశంకర్ భూపాలపల్లి 4, రాజన్న సిరిసిల్లా 3, భద్రాద్రి కొత్తగూడెం 3, వికారాబాద్ 3, జనగాం 3, గద్వాల్ 2, నిర్మల్ 1, భువనగిరి 1, మెదక్ 1గా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 22,312కు పెరిగింది. ఈరోజు కరోనా చికిత్స పొందుతూ 1,342 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 11,537కు పెరిగింది. ఈరోజు కరోనాతో ఐదుగురు మృతిచెందగా ఇప్పటివరకు మృతిచెందినవారి సంఖ్య 288కు చేరింది. ప్రస్తుతం ఆసుపత్రిలో 10,487 మంది చికిత్స పొందుతున్నారు.