కరోనా భయం..కామారెడ్డిలో డాక్టర్ల రాజీనామా - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా భయం..కామారెడ్డిలో డాక్టర్ల రాజీనామా

April 5, 2020

coronavirus fear six doctors resigned in kamareddy

కరోనా వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇలాంటి విపత్కర సమయంలోనూ కొందరు డాక్టర్లు ప్రాణాలకు తెగించి బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అయితే కొందరు డాక్టర్లు మాత్రం తమకు ఎక్కడ కరోనా సోకుతుందో అనే భయంతో విధులకు హాజరు కావడం లేదు. మరి కొందరు డాక్టర్లు ఏకంగా ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. తాజాగా తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఇలాంటి ఓ సంఘటన చోటు చేసుకుంది.

కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యులు మూకుమ్మడి రాజీనామా చేశారు. ఐసీయూలో విధులు నిర్వహిస్తున్న పల్మనాలజిస్టులు ప్రవీణ్‌ కుమార్, నరేన్‌ కుమార్‌, ఫిజీషియన్‌ వైద్యులు రవితేజ, సాయిలు, అనెస్తేషియా నిపుణులు రమణ, పిల్లల వైద్యుడు ముత్యం, నాగేందర్‌ రాజీనామా చేసినవారిలో ఉన్నారు. జిల్లాలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయని.. రోజూ వందలాది మంది ఆస్పత్రికి వస్తున్నారని వారు తెలిపారు. తమ ఇంట్లో వాళ్లు కూడా తాము విధులకు హాజరవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని రాజీనామా చేసిన డాక్టర్లు పేర్కొన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ అశోక్ కుమార్‌కు తమ రాజీనామా లేఖను సమర్పించారు. వీరంతా కాంట్రాక్ట్‌ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.