ఏటీఎంపై వాడకంపై కేంద్రం హెచ్చరికలు.. మాస్క్, శానిటైజర్..
లాక్‌డౌన్‌తో పనుల్లేక ఉన్న డబ్బులనే వాడుకుంటున్నారు ప్రజలు. కొందరు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ చేసుకుంటున్నారు. ఆ వెసలుబాటు లేనివారు ఏటీఎంకు వెళ్లి డబ్బులు తెచ్చుకుంటున్నారు. అయితే ఏటీఎంకు వెళ్లినవారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనా బారినపడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో అన్నీ జాగ్రత్తలు తీసుకుని ఉంటున్నవారు ఏటీఎంకు వెళ్లినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. కరోనా సోకిన వ్యక్తి అతనికి తెలియకుండా ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసుకుంటాడు. అప్పుడతను ఆ ఎటీఎం సెంటర్‌లో ఏ వస్తువును తాకినా దానిమీద వైరస్ ఉండిపోతుంది. ముఖ్యంగా పిన్ బటన్‌ల మీద ఖచ్చితంగా ఉంటుంది. దీంతో ఇతరులు వెళ్లినప్పుడు వారికి వైరస్ సోకే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో కరోనా వైరస్ వ్యాప్తికి ఏటీఎంలు నిలయాలుగా మారుతున్నాయి. తాజాగా గుజరాత్, మహారాష్ట్రల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఏటీఎం సెంటర్‌లలో ఏ మాత్రం అలసత్వం వహించిన వైరస్ సోకే ప్రమాదం చాలా ఉంది అంటున్నారు. ఏటీఎం సెంటర్‌కు వెళ్లే వారు ఖచ్చితంగా పలు జాగ్రత్తలు పాటించాల్సిందే. డబ్బుల కోసం ఏటీఎం సెంటర్‌కు వెళ్లే ముందు తప్పనిసరిగా సానిటైజర్‌ను రాసుకోవడమే కాక, మోహానికి మాస్క్‌ను ధరించాలి. క్యూ లైన్ ఉంటే భౌతిక దూరం పాటించాలి. చేతులకు గ్లౌజ్‌లు వేసుకుని, తరువాత తీసేయడం ఇంకా మంచిదంటున్నారు. బ్యాంకులు సైతం ఏటీఎం సెంటర్లను శానిటైజ్ చేయాలని నిబంధన పెట్టాయి. కరోనా వ్యాప్తికి ఏటీఎంలు ప్రధాన కేంద్రాలుగా మారే ప్రమాదం ఉందని బ్యాంకులు ఈ పనికి పూనుకున్నాయి. ఏటీఎంను వినియోగించిన ప్రతిసారి శుభ్రం చేయాలి. హాట్‌స్పాట్ ప్రాంతాల్లోని ఏటీఎంలను స్థానిక మున్సిపల్ సిబ్బంది రోజుకు రెండుసార్లు శానిటైజ్ చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన పాటించని ఏటీఎం కేంద్రాలను అధికారులు మూసివేయనున్నారు.