నో ఎంట్రీ.. రెడ్ జోన్‌లో విశాఖ - MicTv.in - Telugu News
mictv telugu

నో ఎంట్రీ.. రెడ్ జోన్‌లో విశాఖ

April 4, 2020

Coronavirus hotspot: Visakha district declared as red zone

రోజురోజుకు ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా ముప్పు ఉన్న రెడ్ జోన్‌లోకి విశాఖ నగరం చేరింది. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న 29 హాట్‌స్పాట్‌లను కేంద్రం ఇప్పటికే గుర్తించింది. వైరస్ తీవ్రత పెరిగే దృష్ట్యా 8 రాష్ట్రాల పరిధిలోని మరికొన్ని జిల్లాలను కేంద్రం గుర్తించింది. ఆ జాబితాలో విశాఖ చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి ప్రీతి సూడాన్ వెల్లడించారు. దీంతో ఏపీలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ జాబితాలోకి ఢిల్లీలోని న్యూఢిల్లీ, బిహార్‌లోని ముంగేర్, చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్, హరియాణాలోని ఫరీదాబాద్, తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ విషయమై ప్రీతి సూడాన్ మాట్లాడుతూ.. ‘దేశంలో రెడ్ జోన్‌లు పెరగడానికి ఢిల్లీ మర్కజ్ తబ్లీగీ జమాత్ లింకులే కారణం. ఆ మీటింగ్‌కు వెళ్లినవారు దేశంలోని వివిధ రాష్ట్రాలకు విస్తరించారు. దీంతో అధికార యంత్రాంగం వారి వివరాలు సేకరిస్తూ.. క్వారంటైన్‌కు తరలించే ఏర్పాటు చేస్తోంది. రెడ్ జోన్ ప్రకటించిన ప్రాంతాల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తారు. ప్రజలు ఎవ్వరు ఆ పరిసరాల్లో తిరగడానికి వీలు లేదు’ అని తెలిపారు. కాగా, ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా వ్యాప్తి చెందుతోంది. బుధవారం ఇద్దరికి, గురువారం 21 మందికి కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. శుక్రవారం మరో ఇద్దరికి ఈ వైరస్ సోకిందని.. కృష్ణా, గుంటూరు జిల్లాలో అధికంగా కేసులు నమోదు అవుతున్నాయని చెప్పారు.