టోల్ ఫీజ్ రద్దు.. లాక్‌డౌన్ ఎత్తేసే వరకు…   - MicTv.in - Telugu News
mictv telugu

టోల్ ఫీజ్ రద్దు.. లాక్‌డౌన్ ఎత్తేసే వరకు…  

March 26, 2020

Coronavirus in India

‘ఎక్కడివారు అక్కడే గప్‌చుప్’ అనే మాటను దేశవ్యాప్త లాక్‌డౌన్ నిజం చేసింది. ఎవరి ఇళ్లకి వారు పరిమితం అవడంతో ఒకరి ఇళ్లకు ఒకరు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ కలిసినా షేక్‌హ్యాండ్ ఇవ్వనటువంటి పరిస్థితి దాపురించింది. ఈ కారణంగా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి కాదుగదా… ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు కూడా వెళ్లలేని పరిస్థితి వచ్చేసింది. ప్రజా రవాణాను పూర్తిగా రద్దు చేశారు. కేవలం అత్యవసర వాహనాలకు మాత్రమే అటూ ఇటూ తిరిగేందుకు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో నేషనల్ హైవేలు వాహనదారులపై జాలిచూపాయి. దేశవ్యాప్తంగా టోల్ గేట్ల వద్ద ఫీజులు వసూలు చేయవద్దని, లాక్ డౌన్ అమలులో ఉన్నంతకాలం ఎలాంటి రుసుములు లేకుండా వాహనాలను వదిలేయాలని ఆదేశాలు జారీచేసింది. 

ఇప్పటికే బీబీనగర్ సమీపంలోని గూడూరు టోల్ ప్లాజాకు ఈ ఆదేశాలు అందడంతో, నిన్న రాత్రి నుంచే వాహనాలను ఉచితంగా తిరగనిస్తున్నారు. టోల్ బూత్‌లలో పని చేసే సిబ్బందిని ఇళ్లకు పంపించి వేశారు. పోలీసులు, డాక్టర్లు, పాలు, నిత్యావసరాల వాహనాలే వెళ్తుండటంతో నేషనల్ హైవేస్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాగా, బీబీనగర్ టోల్ ప్లాజా నుంచి 23వ తేదీన 10,650 వాహనాలు, 24న 3,880, 25న 1,650 వాహనాలు వెళ్లాయి. వాహనాల రాకపోకల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.