కోరలు చాచిన కరోనా.. దేశంలో 2,902 కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

కోరలు చాచిన కరోనా.. దేశంలో 2,902 కేసులు

April 4, 2020

Coronavirus in India Latest Updates  

దేశంలో కరోనా కేసులు అమాంతం పెరిగిపోయాయి. ఇంత వరకూ లేని విధంగా కేవలం శుక్రవారం ఒక్కరోజే అత్యధికంగా 601 కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు 2,902కు బాధితుల సంఖ్య చేరింది. మృతుల సంఖ్య  కూడా 68కి చేరగా 24 గంటల్లో 12 మంది ప్రాణాలను వదిలారు. 2,650 మందికి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా,183 మంది కోలుకున్నారు. వైరస్ లక్షణాలు మన దేశంలో కనిపించినప్పటి నుంచి ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. 

ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌కు వెళ్లి వచ్చిన కారణంగా ఈ కేసుల సంఖ్య పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. వేలాది మంది దేశంలోని చాలా ప్రాంతాలకు చేరడంతో అన్ని రాష్ట్రాల్లోనూ వైరస్ సోకిన వారి సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ, ఏపీ,ఢిల్లీ, తమిళనాడులో అమాంతం కరోనా కేసులు పెరిగిపోయాయి. తెలంగాణలో బాధితుల సంఖ్య 229కి చేరగా మరణించిన వారు 11 మంది. అటు ఏపీలోనూ వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతోంది. తాజా లెక్కల ప్రకారం 180 మందికి పాజిటివ్ లక్షణాలు ఉన్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ఓ వైపు లాక్‌డౌన్ కొనసాగుతున్నా బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది.