ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నచోట కరోనా నశిస్తుందని.. శీతల ప్రదేశాల్లో వైరస్ వ్యాప్తి చెందుతుందని వైద్యులు చెబుతున్న విషయం తెలిసిందే. అయితే రైళ్లలోని ఏసీ బోగీల్లో ప్రయాణించడం వల్ల కరోనా సోకదని రైల్వేశాఖ చెప్పింది. లాక్‌డౌన్ నిబంధనల సడలింపులో భాగంగా రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. మంగళవారం నుంచే ఈ రైళ్లు ప్రారంభం కాగా, ఏసీ బోగీల్లో ప్రయాణించేవారికి కరోనా వైరస్ వ్యాప్తిస్తుందని.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అనుమానాలు ప్రయాణికుల్లో నెలకొన్నాయి. వీటిపై రైల్వేశాఖ స్పందిస్తూ.. ఏసీ కోచ్‌లలో ప్రయాణించడం వల్ల కరోనా వ్యాపించదని తేల్చిచెప్పింది.
ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘సెంట్రలైజ్డ్ ఏసీ ప్రదేశంలో గాలి ఎప్పటికప్పుడు పూర్తిగా మారిపోతుందని ఆరోగ్య మంత్రిత్వశాఖ చెబుతోంది. ఏసీ బోగీల్లో గాలి ప్రతి గంటకూ దాదాపు 12సార్లు మారిపోతుంటుంది. ది రూఫ్ మౌంటెడ్ ఏసీ ప్యాకేజ్ యూనిట్(ఆర్‌ఎంపీయూ) సిస్టమ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఏసీ కోచ్‌లను ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ఇది ఎక్కువసార్లు స్వచ్ఛమైన గాలిని లోపలికి పంపిస్తుంది. గతంలో ఆర్‌ఎంపీయూ వ్యవస్థ గంటకు ఐదుసార్లు మాత్రమే పూర్తిగా గాలిని మార్చేసేది. కానీ, దాన్ని ఇప్పుడు మార్చారు. ప్రస్తుతం నడుపుతున్న ప్రత్యేక రైళ్లలో ప్రయాణికులెవరికీ దుప్పట్లు ఇవ్వరు. అదే విధంగా ఉష్ణోగ్రత 23 డిగ్రీల నుంచి 25 డిగ్రీల మధ్య ఉండేలా చూస్తున్నాం. ప్రయాణికుల భద్రమైన ప్రయాణం కోసం రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది’ అని రైల్వేశాఖ వెల్లడించింది.