వలస దారుణం.. గంటలో ఇల్లు చేరతానన్నాడు, అంతలోనే.. - MicTv.in - Telugu News
mictv telugu

వలస దారుణం.. గంటలో ఇల్లు చేరతానన్నాడు, అంతలోనే..

May 29, 2020

 

UP

ఉత్తరప్రదేశ్‌లో వలస కార్మికుల ఉదంతాలు చూస్తుంటే గుండెలు తరుక్కుపోతున్నాయి. నిద్రాహారాలు లేక ఫ్లాట్‌ఫామ్‌పైనే ప్రాణాలు వదిలిన బిహార్‌ మహిళా వలస కూలీ ఘటన గురించి మరిచిపోక ముందే ఝాన్సీ జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది.  ముంబై వలస వెళ్లిన ఓ వ్యక్తి ఇంటికి తిరుగు పయనమయ్యే క్రమంలో ప్రాణాలు విడిచాడు. మరో 70 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇల్లు చేరుతాననగా ఆయన అనంతలోకాలకు చేరాడు. తనవాళ్లను చూసుకుని ఇంటివద్ద కలోగంజో తాగుతూ కరోనా రోజులు వెళ్లదీద్దామని బయలుదేరిన ఆ వ్యక్తి మార్గమధ్యలోనే మృతిచెందడం కలకలం రేపుతోంది. రైలు టాయ్‌లెట్‌లో పడిపోయి చనిపోయినా.. ఐదు రోజుల వరకు అతన్ని ఎవరూ చూడకపోవడం మరో విషాదం. బస్తీ జిల్లాకు చెందిన 38 ఏళ్ల మోహన్‌ లాల్‌ శర్మ ముంబైలో రోజూవారీ కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కరోనా లాక్‌డౌన్‌తో అందరిలాగే అతని పరిస్థితి కూడా దుర్భరంగా తయారైంది. దీంతో శ్రామిక్‌ రైలులో ఇంటికి బయల్దేరాడు. అందరితోపాటు మే 23న ఝాన్సీకి చేరుకున్నాడు. అనంతరం ఝాన్సీ జిల్లా యంత్రాంగం శ్రామిక్‌ రైలులో వచ్చినవారిని ఆయా ప్రాంతాలకు వెళ్లే స్థానిక రైళ్లలో పంపించింది. 

అక్కడినుంచి శర్మ ఊరు 70 కిలోమీటర్లే. ఇంకో గంటా గంటన్నరలో తన ఊరికి చేరిపోతానని బాగా సంబరపడ్డాడు అతడు. కానీ, అతనొకటి తలిస్తే విధి మరోటి తలచింది. చివరగా శర్మ తన బంధువు ఒకరికి ఫోన్ చేసి.. తనను గోరఖ్‌పూర్‌ రైల్వేస్టేషన్‌లో కలుసుకోవాలని కోరాడు. అయితే, ఆ బంధువు మే 24న శర్మ ఫోన్‌కు కాల్‌ చేయగా.. స్విచ్చాఫ్‌ అని వచ్చింది. గోరఖ్‌పూర్‌లో ప్రయాణికులను దించిన తర్వాత రైలు మే 27న తిరిగి ఝాన్సీకి వెళ్లిపోయింది. అదేరోజు సాయంత్రం రైల్వే కోచ్‌లు శుభ్రం చేస్తున్న క్లీనింగ్‌ సిబ్బంది రైలు టాయ్‌లెట్‌లో శర్మ శవం చూసి షాకయ్యారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అధికారులు వెంటనే శర్మ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ‘ఝాన్సీలో ప్రయాణికులను దించిన తర్వాత.. టాయ్‌లెట్‌లో పడిపోయిన శర్మను ఎవరూ చూడలేదు. శర్మకు కోవిడ్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాతనే శ్రామిక్‌ రైలులో అనుమతించాం. అతనికి ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు వెల్లడి కాలేదు. ప్రయాణ సమయంలో ఎవరూ అనారోగ్యంతో బాధపడుతున్న సమాచారం లేదు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేసిన తర్వాత శర్మ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగిస్తాం’ అని అధికారులు వెల్లడించారు. శర్మ మరణవార్తను తెలుసుకున్న అతని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అతని గ్రామంలో విషధ ఛాయలు అలుముకున్నాయి.