వర్మ ‘కరోనా వైరస్’ మూవీ ట్రైలర్ వచ్చేసింది..
సమకాలీన అంశాల మీద అప్పటికప్పుడు కథలు అల్లి సినిమాలు తీయడం ఒక్క సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మకే చెల్లింది. అప్పటికప్పుడు అనుకుంటాడు, తీసేస్తాడు, విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తాడని వర్మను ఇండస్ట్రీలో అనేమాట. కరోనా వైరస్ రావడంతో సినిమా, సీరియల్ షూటింగులే ఆగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో వర్మ ఓ సినిమానే తీసేశాడు. ఆ సినిమా పేరు ‘కరోనా వైరస్’. దానికి సంబంధించిన ట్రైలర్‌ను వర్మ వదిలాడు. దీంతో టాలీవుడ్ సహా అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడు ఎలా షూటింగ్ చేశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అగస్త్యమంజు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ట్రైలర్ తెలుగు ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌పై వస్తున్న మొదటి సినిమా అని వర్మ అంటున్నాడు. ట్రైలర్‌లో కరోనా వైరస్ గురించి టీవీల్లో అలర్ట్ వార్తలు వస్తుంటాయి.
ఇంతలో వేరే గదిలో తన కుమార్తె దగ్గుతున్న చప్పుడు విని వెళ్లి తలుపు తీసి చూస్తాడు. ఆమె ఎక్కువగా దగ్గుతోందని డాక్టర్‌కి చూపించాలని కుటుంబ సభ్యులు కూర్చుని మాట్లాడుకుంటారు. మనం నిత్యం మాస్కులు, శానిటైజర్లు వాడుతుండగా కరోనా ఎలా సోకుతుందని, పడిశం మందు ఇవ్వమని తన భార్యకు చెబుతాడు ఆ తండ్రి. ఆమె అలా దగ్గుతుంటే కుటుంబ సభ్యులు అనుమానంగా చూస్తూ దూరంగా జరుగుతుంటారు. కరోనా వైరస్ సోకినవారి పట్ల ఈ సమాజం ఎలా వ్యవహరిస్తుందో వర్మ ఈ సినిమాలో చూపించబోతున్నాడని నెటిజన్ల కామెంట్లు చేస్తున్నారు. కాగా, ‘జార్జిరెడ్డి’ సినిమాలో జార్జిరెడ్డి సోదరిగా నటించిన సోనియా ఆకుల ఈ కరోనా వైరస్ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని వర్మ థియేటర్లలో రిలీజ్ చేస్తాడా, లేక, ఓటీటీ వేదికలపై రిలీజ్ చేస్తాడా? అన్నది వేచి చూడాల్సిందే.