గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగి మృతి..డాక్టర్లపై దాడి - MicTv.in - Telugu News
mictv telugu

గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగి మృతి..డాక్టర్లపై దాడి

April 1, 2020

Coronavirus positive person passed away in gandhi hospital

తెలంగాణలో మరో కరోనా వైరస్ మృతి సంభవించింది. ఈరోజు గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ రోగి మృతి చెందినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ వెల్లడించారు. అయితే అదే వార్డులో ఉన్న మృతుడి అన్న వైద్యులపై దాడి చేశాడు. డాక్టర్లపై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి చెస్ట్ ఆస్పత్రిలో క్వారంటైన్ కు తరలించామని నగర సీపీ అంజనీ కుమార్ తెలిపారు.

గాంధీ ఆసుపత్రి డాక్టర్లపై దాడిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఖండించారు. విపత్కర సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్యులపై దాడి చేయడం సరికాదన్నారు. డాక్టర్స్ మీద దాడి చేయడాన్ని హేయమైన చర్యగా తెలిపారు. ఇలాంటి గంభీరమైన సమయంలో ఇలాంటి ఘటనలు మంచిది కాదన్నారు. డాక్టర్లకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ప్రతి డాక్టర్ కి రక్షణ కల్పిస్తాం. భరోసాతో పని చేయండి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాము. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సంయమనంతో వ్యవహరించి కరోనాను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. కాగా తెలంగాణలో కరోనా వల్ల ఇప్పటి వరకు ఆరుగురు మరణించారు. ప్రస్తుత మరణంతో ఏడవ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. రాష్ట్రంలో ఇప్పటి వరకు వందకు చేరువలో కరోనా కేసులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.