వలస కూలీలను 15 రోజుల్లో ఇళ్లకు పంపండి.. సుప్రీం ఆదేశం - MicTv.in - Telugu News
mictv telugu

వలస కూలీలను 15 రోజుల్లో ఇళ్లకు పంపండి.. సుప్రీం ఆదేశం

June 5, 2020

Supreme Court.

 వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలను 15 రోజుల్లోగా వారివారి స్వస్థలాలకు పంపాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసింది. లాక్‌డౌన్ కారణంగా వలస కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలపై మీడియాలో వచ్చిన కథనాలను.. సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించింది. విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు జారీచేసింది. 4,200 శ్రామిక్ రైళ్లలో కోటి మంది కార్మికులను జూన్ 3 వరకు వారి స్వస్థలాలకు పంపామని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అంతకుముందు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎంఆర్ షాలు త్రిసభ్య ధర్మాసనానికి వివరించారు. ఉత్తరప్రదేశ్, బీహార్‌ రాష్ట్రాలకు శ్రామిక్ రైళ్లను పెద్ద సంఖ్యలో నడిపామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాల వివరాల ఆధారంగా వాటిని నడిపినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో మీడియలో వచ్చిన కథనాలను సుప్రీం సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది.

 మే 28 నాటి విచారణ సందర్భంగా వలస కూలీలను వారి స్వస్థలాలకు రైళ్లు, బస్సుల ద్వారా తరలించాలని సూచిచింది. వారికి ఆహారం అందజేసి, ఉచిత రవాణా సౌకర్యాలు కల్పించాలని స్పష్టంచేసింది. కాగా, లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం, లోపాలు ఉన్నాయని గతంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘వలస కార్మికుల ఇబ్బందులు ఇప్పటికీ తొలగిపోలేదు. రోడ్లు, జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్లు, రాష్ట్రాల సరిహద్దుల్లో వేలాదిమంది చిక్కుకున్నారు. ఈ సంక్షోభం నుంచి వారిని బయట పడేయడానికి పటిష్ఠ చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించాలి’ అని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.