కరోనా పెండెంట్.. వైరస్‌తో వ్యాపారమంటూ..  - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా పెండెంట్.. వైరస్‌తో వ్యాపారమంటూ.. 

April 7, 2020

Coronavirus, Silver Pendant, Russia, Vorobev, 13 Dollars, Social Media

కరోనా వైరస్ ఆకారంతో మొన్నఓ ఎస్సై హెల్మెట్ ధరించి ఆశ్చర్యపరిచారు. కోల్‌కతాలో ఓ స్వీట్ షాపు యజమాని కరోనా ఆకారంలో స్వీట్ తయారుచేసిన విషయం తెలిసిందే. తాజాగా రష్యాలోని ఓ నగల వ్యాపారి కరోనా ఆకారంలో వెండి పెండెంట్స్ తయారు చేస్తోంది. ఈ పెండెంట్‌పై సోషల్ మీడియాలో ఆదరణకు సమవుజ్జీగా విమర్శలు గుప్పుమంటున్నాయి. రష్యాకు చెందిన డాక్టర్‌ వొరొబెవ్‌ వాటిని తయారుచేస్తోంది. వైరస్‌ ఆకృతితో వెండితో తయారుచేసిన ఈ పెండెంట్స్‌‌ను 13 డాలర్లకు ఒక పెండెంట్‌ చొప్పున అమ్మకాలు జరుపుతున్నారు. యువత వీటిని ఆసక్తిగా కొని ధరించి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు.  అయితే మరికొంత మంది ఈ పెండెంట్‌‌ను విమర్శిస్తున్నారు. 

కరోనా వల్ల వేల మంది ప్రాణాలు కోల్పోతుంటే.. లక్షల కుటుంబాలు రోడ్డున పడుతుంటే.. వైరస్‌తో వ్యాపారం చేస్తావా? అని వొరొబెవ్‌ను కడిగిపారేస్తున్నారు. అయితే వొరొబెవ్‌ మాత్రం ఆ విమర్శలను అస్సలు పట్టించుకోకుండా.. తనను తాను సమర్థించుకుంటోంది. ‘నేను తయారు చేస్తున్నది మెడికల్‌ జ్యువెలరీ. వైద్య సిబ్బంది మంచి కోసమే నేను వీటిని తయారుచేస్తున్నాను. కరోనాపై మనం సాధిస్తున్న విజయానికి ప్రతీకగా ఈ పెండెంట్‌ నిలుస్తుంది. కరోనా బారి నుంచి కోలుకున్న చాలా మంది.. వారికి చికిత్స అందిస్తున్న వైద్యులకు ఈ పెండెంట్‌ను కానుకగా ఇస్తున్నాను’ అని వొరొబెవ్ తెలిపింది. కాగా, ఆమె కేవలం కరోనా వైరస్‌ మాత్రమే కాదు.. బ్యాక్టీరియా, డీఎన్‌ఏ, గుండె తదితర ఆకృతులతో పెండెంట్‌లు తయారు చేస్తోంది. ఆమెకు ‘మెడికల్‌ జ్యువెలరీ ‘నగల వ్యాపారి అనే పేరుంది. వైద్య సిబ్బంది కోసం ప్రత్యేకంగా తయారుచేసే ఆభరణాలను మెడికల్ జువెలరీ అంటారు. వెండికి సూక్ష్మక్రిములను అడ్డుకునే తత్వం ఉండటంతో ఆ ఆభరణాలను వెండితో తయారు చేస్తానంటోంది ఆమె.