వచ్చే ఏడాది జూన్ వరకు ఉచిత రేషన్.. దీదీ కీలక నిర్ణయం - MicTv.in - Telugu News
mictv telugu

వచ్చే ఏడాది జూన్ వరకు ఉచిత రేషన్.. దీదీ కీలక నిర్ణయం

June 30, 2020

Mamata Banerjee.

రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ వల్ల దేశంలో పేద ప్రజలకు నవంబర్ వరకు రేషన్ ఉచితంగా అందిస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాని ప్రసంగం అయిపోయన కొద్ది సేపటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పేదలకు అండగా నిలిచే దిశలో కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది జూన్ వరకు పేదలకు ఉచితంగా రేషన్ అందించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు దీదీ మంగళవారం ఓ ప్రకటన చేశారు. లాక్‌డౌన్ సమయంలో ప్రకటించిన ఉచిత రేషన్ పథకాన్ని 2021 జూన్ వరకు పొడిగిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

ఈ మేరకు దీదీ మట్లాడుతూ.. ‘కేంద్ర ప్రభుత్వ పథకంతో రాష్ట్రంలో కేవలం 60శాతం మంది ప్రజలకు మాత్రమే ఉచితంగా రేషన్‌ అందే అవకాశం ఉంది. సగం మందికి మాత్రమే రేషన్‌ ఇచ్చి తేడాలెందుకు చూపుతున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత రేషన్‌ ఇవ్వాలి’ అని తెలిపారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన 59 యాప్స్‌ను నిషేధించడాన్ని ఆమె తప్పుబట్టారు. చైనా విషయంలో ప్రజలంతా ఆవేశంగా ఉన్నారని దానికి ధీటైన సమాధానం చెప్పాలి తప్పా.. ఇలా యాప్స్‌ను నిషేధిస్తే ఫలితం ఉండదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మెట్రోరైలు సేవలకు అనుమతించాలని కేంద్రాన్ని కోరానని అన్నారు. మెట్రోరైళ్లను, విమాన సర్వీసులను ప్రారంభించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాసినట్లు చెప్పారు.