ఈ మాస్కులను తినేయొచ్చు.. రూ. 40కి రెండు  - MicTv.in - Telugu News
mictv telugu

ఈ మాస్కులను తినేయొచ్చు.. రూ. 40కి రెండు 

July 9, 2020

manna

కరోనా సమయంలో రకరకాల మాస్కులు వస్తున్నాయి. అవన్నీ వాడి పారేసేవే. అయితే ఈ మాస్కులను ఎంచక్కా తినొచ్చు.. ఎంతో రుచిగానూ ఉంటాయి. ఆశ్చర్యంగా ఉంది కదూ. పుర్రెకో బుద్ధి జిహ్వాకో రుచి అని ఇందుకే అన్నారేమో.  త‌మిళ‌నాడులోని మ‌ధురైలోని రెస్టారెంట్ నిర్వాహ‌కులు ఈ ‘పరోటా మాస్కు’లను తయారు చేశారు. అనుకోకుండా వచ్చిన ఈ ఆలోచనను వారు అమలులో పెట్టారు. గుడ్రంగా చేసే పరోటాలను దీర్ఘ చతురస్రాకారంలో తయారు చేసి, అట పక్క ఇటు పక్క డోరీలు అంటించి పెంక మీద కాకబెడుతున్నారు. 

మొద‌ట్లో రెండు మాస్కు ప‌రోటాలు ఉండే ప్లేట్‌ను రూ.40గా నిర్ధారించారు. జనాలు మాస్కు పరోటాలను తినడానికి ఎగబడే సరికి విప‌రీత‌మైన డిమాండ్ వచ్చింది. దీంతో ఆ ధ‌ర‌ను రూ.50కి పెంచారు. ఈ విషయమై హోట‌ల్ య‌జ‌మాని కేఎల్ కుమార్ మాట్లాడుతూ.. ‘గతంలో మా హోట‌ల్‌కు వ‌చ్చేవారు మాస్కు లేకుండా వచ్చేవారు. కానీ ఇప్పుడు మాస్కు ప‌రోటాలు కొన‌డానికే వ‌స్తున్నారు’ అని తెలిపాడు. ఈ ప‌రోటా తయారు చేయడానికి ప‌రోటా స్పెష‌లిస్టు ఎస్ స‌తీష్‌కు రెండు రోజుల సమయం పట్టింది. మరో విశేషం ఏంటంటే.. మాస్కుల్లో ర‌కాలు ఉన్న‌ట్టే.. మాస్కుల ప‌రోటాల్లోనూ ర‌కాలు ఉన్నాయి అంటున్నాడు. వీటి త‌యారీ విధానాన్ని అక్క‌డున్న వంట‌వారికి నేర్పిస్తున్నాడు. కాగా, ప్ర‌స్తుతం ఈ మాస్కుల ప‌రోటాలు సోష‌ల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ‘ఈ ఫోటో చూసి మీ మాస్కును తినేసేరు’ అని కొంద‌రు జోకులు పేల్చుతున్నారు. ‘భలే ఉంది మస్కు పరోటా. దీనిలోకి శానిటైజర్ లాంటి చట్నీ ఇవ్వండి భలే ఉంటుంది కాంబినేషన్’ అని మరో యూజర్ కామెంటాడు.